పార్టీలో కొందరు ఇబ్బంది పెడుతున్నారు.. సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం: వసంత కృష్ణ ప్రసాద్

By Sumanth KanukulaFirst Published Nov 24, 2022, 2:06 PM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు తనను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణా ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు తనను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. పార్టీ మారతానని, మరో చోటు నుంచి పోటీ చేస్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోటీ చేస్తే జగన్ నాయకత్వంలో వైసీపీ నుంచే చేస్తానని తెలిపారు. మైలవరం నుంచే బరిలో ఉంటానని స్పష్టం చేశారు. 

తనను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఆధారాలతో సహా చూపించానని చెప్పారు. ఇతర విషయాలను పట్టించుకోవద్దని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారని తెలిపారు. అన్ని విషయాలను తాను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్  కేబినెట్‌లో కమ్మ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేదంటూ మాజీ మంత్రి, వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అధికార వైసీపీలో కూడా ఆయన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. ఈ క్రంలోనే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జలను కలిశారు. తాను వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని, తన తండ్రి వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వసంత కృష్ణా ప్రసాద్ తెలిపారు. సజ్జలకు అన్ని విషయాలను వివరించినట్లు తెలిపారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోనికి తీసుకోవద్దని కోరినట్లు వివరించారు. తనకు జోగి రమేశ్ వల్ల కలుగుతున్న ఇబ్బందులను సజ్జలకు వివరించినట్లు కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆరోగ్యం బాలేక గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఉన్నానని ఆయన తెలిపారు

అంతకుముందు కృష్ణ ప్రసాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తనకు మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఆయనకు తన మద్దతును కొనసాగిస్తానని చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణపై సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, ఊహాగానాలను ఆయన ఖండించారు. మైలవరం నుంచి మళ్లీ పోటీ చేయాలని జగన్ మోహన్ రెడ్డి కోరితే చేస్తానని, లేదంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తానని అన్నారు. 175 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా అసెంబ్లీలో కూర్చునే అవకాశం సీఎం కల్పించారని చెప్పారు. తన తండ్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని.. ఆయన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 

click me!