
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో రేపు మరోసారి వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ వర్క్ షాప్‌లో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల హాజరు, ప్రజలు స్పందన, ఎదురవుతున్న సమస్యలు, ఏ మేరకు సమస్యల పరిష్కారం జరిగిందనే అంశాలపై సీఎం జగన్ ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా రేపటి వర్క్ షాప్‌లు చర్చ సాగే అవకాశం ఉంది.
అయితే రానున్న ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని వైసీపీ అడుగులు వేస్తుంది. మంత్రులు, వైసీసీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా సీఎం జగన్ ప్రణాళికలు రచించారు. ఈ ఏడాది మే 11న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం దాదాపు 8 నెలల పాటు సాగనుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తప్పనిసరిగా సచివాలయాల కేంద్రంగా గడప గడపకు వెళ్లాలని పార్టీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు. నెలలో కనీసం 10 సచివాలయాలను సందర్శించాలని చెప్పారు. దీంతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించడమే కాకుండా.. అవి అందుతున్నాయా..? లేదా..? అని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానికుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇక, ఈ ఏడాది జూన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వర్క్‌షాప్ నిర్వహించారు. మంత్రులు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయని.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలని వైఎస్ జగన్ పార్టీ నేతలతో అన్నారు. ఇది కష్టం కాదని.. ప్రతి ఇంటికీ మీరు వెళ్తున్నారు, ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరిస్తున్నామని ఆయన చెప్పారు.