విద్యార్థులకు సెప్టెంబర్‌లోగా ట్యాబ్‌లు.. ఆ శక్తి చదువుకే ఉంది: అమ్మఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published Jun 27, 2022, 1:33 PM IST
Highlights

గత మూడేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందాలన్నారు. మనిషి తలరాతను మార్చగలిగే శక్తి చదవుకు మాత్రమే ఉందన్నారు. 

గత మూడేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు.  అమ్మ ఒడి మూడో విడుత నగదు విడుదల సందర్భంగా శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంజగన్ మాట్లాడుతూ.. నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందాలన్నారు. మనిషి తలరాతను మార్చగలిగే శక్తి చదవుకు మాత్రమే ఉందన్నారు. చదువే నిజమైన ఆస్తి అని పేర్కొన్నారు. చదవుపై పెట్టే ప్రతి రూపాయి కూడా పిల్లల తలరాతను మారుస్తుంది. 

చదవులు ఎక్కువగా ఉండే దేశాల్లో.. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అమ్మఒడి మూడో విడత కింద రూ. 6,595 కోట్లు జమ చేస్తున్నట్టుగా తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి అందిస్తున్నామని చెప్పారు. అమ్మఒడి కింద మూడేళ్లలో తల్లుల ఖాతాల్లోకి రూ. 19,618 కోట్ల నేరుగా జమ చేసినట్టుగా చెప్పారు. పిల్లలను బాగా చదివిస్తే వారి జీవితాలు మారుతాయని తెలిపారు. అందుకే 75 శాతం హాజరు నిబంధనను తీసుకొచ్చినట్టుగా పేర్కొన్నారు. 

తొలి విడతలోనే 75 శాతం హాజరు నిబంధన పెట్టడం కరెక్ట్ కాదని అప్పుడు పెట్టలేదని చెప్పారు. రెండో విడతలో కోవిడ్ 75 శాతం నిబంధనకు మినహాయింపు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొందని వివరించారు. గతేడాది స్కూళ్లు ప్రారంభం అయ్యాక 75 శాతం హాజరు నిబంధన కారణంగా 51 వేల మంది తల్లులకు అమ్మఒడి ఇవ్వలేకపోయామని చెప్పారు. అమ్మఒడికి ఇస్తున్న సొమ్ములో కాస్తా పిల్లలు వెళ్లే స్కూల్స్‌లో టాయిలెట్ మెయింటనెన్స్, స్కూల్ మెయింటనెన్స్ కేటాయించేలా కార్యచరణ సిద్దం చేసినట్టుగా చెప్పారు. టాయిలెట్ మెయింటనెన్స్, స్కూల్ మెయింటనెన్స్‌లకు వెయ్యి రూపాయల చొప్పున రెండు వేల రూపాయలు తగ్గించనున్నట్టుగా చెప్పారు. 

అమ్మఒడి పథకంపైనా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమ్మఒడి పథకాన్ని విమర్శించే వారిలో ఒక్కరైనా పిల్లల్ని చదివించే తల్లులకు ఒక్క రూపాయి ఇచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అమ్మఒడి లాంటి పథకం తెచ్చారా అని ప్రశ్నలు సంధించారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే దుష్టచతుష్టయానికి నిజాలు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు. మారీచులు, దుష్టచతుష్టయంతో యుద్దం చేస్తున్నామని అన్నారు. దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా, దత్తపుత్రుడుతో జగన్ ఒక్కడే పోరాడుతున్నాడని చెప్పారు.  ప్రజల అండ ఉన్నంతవరకు ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. 

ఒక్కో విద్యార్థికి రూ. 12వేలు విలువ చేసే ట్యాబ్‌ను.. సెప్టెంబర్‌లో అందజేస్తామని సీఎం జగన్ చెప్పారు. ఇందుకోసం రూ.500 కోట్ల ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. ప్రతి క్లాస్‌ రూమ్‌లో డిజిటల్‌ బోర్డులు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇక, కోడి రామ్మూర్తి స్టేడియం మరమ్మత్తుల కోసం పదికోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.
 

click me!