విశాఖపట్నంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను నమ్మించి.. నగ్నఫొటోలు, వీడియోలు పంపాలంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు.
విశాఖపట్నం : ఒక యువతి ఉద్యోగం కోసం రెస్యూమ్ పంపిస్తే, పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. నగ్న ఫోటోలు, వీడియోలు పంపించాలని వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నయవంచకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంవిపి కాలనీ సెక్టర్ 10 లో నివాసముంటున్న తిరుమలశెట్టి కనకరాజు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ గా పని చేస్తున్నానని నగరానికి చెందిన ఒక యువతితో పరిచయం చేసుకున్నాడు.
రోజు ఫోన్లో మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. కొద్ది రోజులకు ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన యువతి తన రెజ్యూమ్ తో పాటు ఫోటోలో సర్టిఫికెట్లను పంపించింది. తర్వాత నగ్న ఫోటోలు పంపించాలని కనకరాజు యువతిని కోరాడు. ముందు ఆమె అంగీకరించలేదు. రోజు అడుగుతుండడంతో, పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఒకసారి నగ్న ఫోటోలు, వీడియోలను వాట్సప్ ద్వారా కనకరాజుకు పంపించింది.
కొద్ది రోజులకు మళ్లీ ఫోటోలు, వీడియోలు పంపించాలని వేధింపులు ప్రారంభించాడు కనకరాజు. లేకపోతే ముందు పంపిన ఫోటోలు వీడియోలు యువతి కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె ఈ నెల 22న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సిసిఎస్ ఏడిసిపి డి. సూర్యశ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ స్టేషన్ మహిళా ఎస్సై, బృందం విచారణ చేపట్టారు. యువతిని బెదిరిస్తున్న వ్యక్తి ఎంవీపీ కాలనీలో నివాసముంటున్న తిరుమల శెట్టి కనకరాజు (48)గా గుర్తించి అరెస్టు చేశారు. అపరిచితులను నమ్మి సోషల్ మీడియా ద్వారా గాని, నేరుగా గానీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు ఇచ్చి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు సూచించారు.
వివాహితను చంపింది ప్రియుడు... ఎందుకోసమంటే..: అనంతపురం హత్య మిస్టరీని చేధించిన పోలీసులు
కాగా, జూన్ 24న నెల్లూరులో ఇలాంటి దారుణమే వెలుగులోకి వచ్చింది. దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన లింగసముద్రం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. తన భర్తను తాగుడుకు బానిస అయ్యేలా చేయడంతోపాటు.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అందుకే తామిద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోతీసుకున్నారు. ఓ లేఖ కూడా రాశారు.
పోలీసుల కథనం ప్రకారం… ‘నా చావుకు, నా భర్త చావు కారణం షేక్ ఇలియాజ్.. నా భర్తను తాగుడికి బానిస అయ్యేలా చేశాడు. ఆయన ద్వారా నాకు మత్తు మందు ఇచ్చి సృహ తప్పి పడిపోయిన తర్వాత పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మేము ఇద్దరం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావు తర్వాత అయినా అతనికి శిక్ష పడుతుందని కోరుకుంటున్నాం’ అని బాధితురాలు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది.
ఆ తర్వాత దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ముందు దంపతులిద్దరూ సెల్ఫీ వీడియో ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. నిందుతుడు వారిని ఎలా బ్లాక్ మెయిల్ చేసిందీ వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.