
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో అతిపెద్ద నగరం, అందరికి ఆమోదయోగ్యమైన విశాఖలోనే తాను కాపురం పెట్టబోతున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. డీబీటీ బటన్ నొక్కడం మాత్రమే కాకుండా.. కులాలు, కుటుంబాల చరిత్రనే కాకుండా ప్రాంతాల చరిత్రను మార్చాలనే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. అందుకే ఈరోజు శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీయమ, కోస్తాంధ్ర.. ఇలా అన్ని ప్రాంతాల్లో నవరత్నాలతో సామాజిక చరిత్రలను తిరిగి రాస్తామని చెప్పారు. ప్రతిచోట మంచి కనిపిస్తుందని తెలిపారు.
మంచి చేశామని చెప్పుకోవడానికి ఎలాంటి అర్హత లేని వారంతా ఏకమవుతున్నారని విమర్శించారు. వారు చేసే చీకటి యుద్దాన్ని గమనించమని కోరారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెప్పి.. అదే నిజమని నమ్మించే చీకటి యుద్దం రాష్ట్రంలో జరుగుతుందని అన్నారు. వాళ్లలాగా తనకు పత్రికలు లేవని, టీవీలు లేవని, సోషల్ మీడియాలు లేవని అన్నారు.
పెత్తందార్ల పక్షాన నిలబడ్డ టీడీపీకి, పేద ప్రజలకు పక్షాన నిలబడ్డ జగన్‌కు యుద్దం జరుగుతుందని చెప్పారు. వ్యవస్థలను మెనేజ్ చేయడం నమ్ముకున్నవారికి.. ప్రజలను నమ్ముకుని, ప్రజల కోసమే బతుకుతున్న వారికి మధ్య యుద్దం జరుగుతుందని అన్నారు. ఈ యుద్దంలో తన నమ్మకం, ఆత్మ విశ్వాసం ప్రజలేనని చెప్పారు. తాను దేవుని దయ, ప్రజల ఆశీస్సులనే నమ్ముకున్నానని తెలిపారు. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని.. కానీ తనకు భయం లేదన్నారు. అబద్దాలను నమ్మవద్దని ప్రజలను కోరుతున్నట్టుగా చెప్పారు.
‘‘మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా మీరు నిలబడండి. వాళ్ల మాదిరిగా నాకు మీడియా చానళ్లు, ఇంత మంది రాజకీయ నాయకులు, దత్తపుత్రుడు లేడు. మీ చల్లని దీవెనలు మీ బిడ్డకు, ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని’’ అని జగన్ చెప్పారు.