కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ కీలక భేటీ..

By Sumanth KanukulaFirst Published May 29, 2023, 9:29 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ అయిన జగన్.. దాదాపు 40 నిమిషాలకు పైగా చర్చలు జరిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ అయిన జగన్.. దాదాపు 40 నిమిషాలకు పైగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి సమస్యలపై అమిత్ షాతో జగన్ చర్చించారని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందేలా చూడాలని కోరినట్టుగా పేర్కొంది.

ఏపీ పునర్విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వేగవంతం చేయాలని అమిత్ షాను జగన్ కోరారు. ఏపీ భవన్‌తోపాటు 9, 10 షెడ్యూల్‌ ప్రకారం ఆస్తుల విభజన అంశాలపై కూడా ఆయన చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను కూడా ప్రస్తావించి.. బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ముగిసిన సీఎం జగన్ పర్యటన.. 
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు తిరుగుపయనమయ్యరు. ఈ నెల 26న ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. అదే రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు.  రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సహాయానికి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక, 27వ తేదీ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలో జగన్ పాల్గొన్నారు. 

నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం తర్వాత కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సమావేశమైన సీఎం జగన్.. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. ఇక, 28వ తేదీ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే రోజు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా  నివాసంలో ఆయనతో సమావేశం అయ్యారు. 

అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొంది. టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.. అంతేకాకుండా బీజేపీని కూడా కలుపుకుని వెళ్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. ఈ ఏడాది పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జగన్ కేంద్రం  నుంచి రాష్ట్రానికి ఆర్థిక తోడ్పాటు కోరినట్టుగా తెలుస్తోంది.

click me!