దెందులూరులో జగన్ ప్రసంగంపై రాజకీయ వర్గాల ఆశ్చర్యం.. సొంత పార్టీలోనూ చర్చ..!

By Sumanth KanukulaFirst Published Mar 25, 2023, 4:16 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు. అయితే దెందులూరులో నిర్వహించిన సభలో జగన్ చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు. అక్కడ నిర్వహించిన వైఎస్సార్ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమంలో జగన్ చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే గతానికి భిన్నంగా.. ఈ రోజు జగన్ ప్రసంగం సాగడమే ఇందుకు కారణం. సాధారణంగా.. సీఎం జగన్ ఏ సభలో పాల్గొన్న.. తొలుత ఆ కార్యక్రమం గురించి మాట్లాడతారు. గత టీడీపీ ప్రభుత్వంతో పోల్చి.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం గురించి వివరించే ప్రయత్నం చేస్తారు. అయితే చివరల్లో టీడీపీ, జనసేనలను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తుంటారు. 

చంద్రబాబు, దత్తపుత్రుడు, దుష్టచతుష్టయం అంటూ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఇందుకు ఆ సభలకు హాజరైన వైసీపీ మద్దతుదారుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. అంతేకాకుండా ప్రసంగం ముగించే సమయంలో.. సభ జరుగుతున్న ప్రాంతానికి చెందిన స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో పాటు.. ఆ ప్రాంతంపై వరాల జల్లు కురిపిస్తుంటారు.

అయితే ఈరోజు దెందులూరు సభలో జగన్ ప్రసంగం చూసిన పలువురు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. సీఎం జగన్ ప్రసంగంలో విపక్షాలపై విమర్శలు చేయలేదు. టీడీపీ హయాంలో డ్వాక్రా మహిళల పరిస్థితిని ప్రస్తావించడంతో పాటుగా.. సున్నా వడ్డీ విషయంలో చంద్రబాబు అనుసరించిన విధానాలపై మాట్లాడారు. అయితే ఎలాంటి రాజకీయ విమర్శలకు సీఎం జగన్ తన ప్రసంగంలో చోటు ఇవ్వలేదు. ప్రభుత్వం చేపట్టిన పథకాల.. ప్రజలకు జరుగుతున్న లబ్ది గురించి మాత్రమే సీఎం జగన్ ప్రసంగించారు. 

ఇటీవల జరిగిన గత రెండు, మూడు సభల్లో కూడా సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నెల 19న తిరువూరులో జరిగిన సభలో కూడా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోతే పొత్తుల కోసం ప్రతిపక్షాలన్నీ ఎందుకు వెంపర్లాడుతున్నాయని ప్రశ్నించారు. ఎందుకు ఈ తోడేళ్లు ఏకం అవుతున్నాయని? తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈరోజు జరిగిన సభలో సీఎం జగన్.. ఎలాంటి  రాజకీయ విమర్శలు చేయకపోవడంపై రాజకీయ వర్గాల్లోనే కాకుండా.. సొంత పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైన చర్చ సాగుతుంది. అయితే ఇందుకు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కారణమై ఉండొచ్చని ప్రతిపక్షాలు చర్చించుకుంటున్నాయి. 

click me!