
అమరావతి: కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది మూతపడ్డ కాలేజీలు ఇటీవలే పున:ప్రారంభమైన నేపథ్యంలో క్లాసులు నిర్వహణ, విద్యార్థుల హాజరు తదితర అంశాల గురించి విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇవాళ(శుక్రవారం) క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఏపీ ప్రైవేటు యూనివర్శిటీ యాక్ట్ -2006ను సవరించడంపై అధికారులో చర్చించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా చట్టానికి సవరణల ప్రతిపాదనలుండాలని సూచించారు. ప్రైవేటు యూనివర్శిటీల్లో 35శాతం సీట్లు గవర్నమెంటు కోటాకింద భర్తీకి ప్రతిపాదించారు. తొలిసారిగా ప్రైవేటు యూనివర్శిటీలు పెట్టేవారికి అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించాలని సూచించారు.
ఇప్పుడున్న కాలేజీలను ప్రైవేటు యూనివర్శిటీలుగా మార్చాలంటే కూడా అత్యుత్తమ ప్రమాణాలను నిర్దేశించాలని సీఎం ఆదేశించారు. ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్ధలతో జాయింట్ సర్టిఫికేషన్ ఉండాలని, ఐదేళ్లకాలం పాటు ఇది కొనసాగాలన్నారు. ఈ క్రైటీరియాను అందుకున్న పక్షంలోనే ప్రైవేటు యూనివర్శిటీగా వారికి అనుమతి ఇవ్వడానికి తగిన అర్హతగా పరిగణించాలన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రైవేటు యూనివర్శిటీ యాక్ట్ -2006కు సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు సీఎం జగన్.
ఇక ఎయిడెడ్ కాలేజీల నిర్వహణపై సమావేశంలో కీలక చర్చ జరిగింది. ఇవి పూర్తిగా ప్రభుత్వంలోనైనా లేక ప్రైవేటు యాజమాన్యాల చేతిలోనైనా ఉండాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి పూర్తిగా అప్పగిస్తే ప్రభుత్వమే నడపాలని, లేని పక్షంలో ప్రైవేటు యాజమాన్యాలే నడుపుకోవాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని అన్ని డిగ్రీకాలేజీల్లో ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయించారు. ఇంజనీరింగు, వైద్యవిద్యా కళాశాలల మాదిరిగానే ఇంగ్లిషులో బోధన చేయాలని సూచించారు. వెంటనే ఇంగ్లిషు మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా దీనికి తగిన కోర్సులను తీసుకురావాలని సీఎం ఆదేశించారు. డిగ్రీ మొదటి ఏడాదిలో దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు.
read more తెలంగాణ ఉద్యమం తరహాలోనే...స్టీల్ ప్లాంట్ కోసం మిలియన్ మార్చ్: గంటా పిలుపు
అలాగే 11, 12(ఇంటర్మీడియట్) తరగతులు కూడా ఇంగ్లిషు మాధ్యమం ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు. ఒకేసారి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఇబ్బందులు రాకుండా పాఠ్యపుస్తకాలన్నీ ఇంగ్లిషు, తెలుగు మాధ్యమాల్లో ముద్రించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్న సీఎం పేర్కొన్నారు.
బీఎ, బీకాం లాంటి కోర్సులు చేసి ఇంగ్లిషులో మాట్లాడలేకపోతే.. పోటీ ప్రపంచంలో రాణించడం కష్టం అవుతుందన్నారు. ఉద్యోగావకాశాలను కల్పించే పాఠ్యప్రణాళికను తయారుచేయాలని సూచించారు.బీకాం చదివిన వారికి ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాలపైన, స్టాక్ మార్కెట్‌వంటి వాటిపైన అవగాహన కల్పించాలన్న సీఎం సూచించారు. దీనివల్ల స్వయం ఉపాధికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఆన్లైన్లో మంచి కోర్సులు ఉన్నాయని, అందులో మంచి అంశాలను పాఠ్య ప్రణాళికలోకి తీసుకురావాలన్నారు సీఎం జగన్.
''ప్రతి గ్రామానికీ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను తీసుకు వస్తున్నాం.దీంతోపాటు అమ్మ ఒడి, వసతి దీవెన పథకాల లబ్ధిదారులకు ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లను సరసమైన ధరకు వచ్చేలా చూస్తున్నాం. ఈ చర్యలు విద్యారంగంలో, నైపుణ్య రంగంలో పెనుమార్పులను తీసుకు వస్తాయి. యూనివర్శిటీల రిక్రూట్‌మెంట్లలో సిఫార్సులకు చోటు ఉండరాదు. నియామకాలన్నీ పారదర్శకంగా జరగాలి. క్వాలిటీ బోధనా సిబ్బంది యూనివర్శిటీల్లో ఉండాలి'' అని అధికారులను సీఎం సూచించారు.
ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ(ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్) ఛైర్ పర్సన్ జస్టిస్ వి ఈశ్వరయ్య, ఏపీఎస్‌సీహెచ్‌ఈ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్) ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.