చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం తోడుగా ఉంటేనే మనుగడ: జగన్

By narsimha lodeFirst Published Jun 29, 2020, 3:09 PM IST
Highlights

చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం తోడుగా ఉంటేనే అవి మనుగడ కొనసాగిస్తాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చిన్న పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కూడ పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.


అమరావతి:చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం తోడుగా ఉంటేనే అవి మనుగడ కొనసాగిస్తాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చిన్న పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కూడ పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు రెండో విడత కింద రూ. 512.35 కోట్లను సీఎం విడుదల చేశారు. తొలి విడత కింద ఈ ఏడాది మే మాసంలో రూ. 450 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగంలో 97,428 యూనిట్లు ఉన్నాయి. వాటిలో 72,531 సూక్ష్మ పరిశ్రమలు కాగా, 24,252 చిన్న పరిశ్రమలు, మరో 645 మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయన్నారు. వీటి ద్వారా దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టుగా చెప్పారు.

 వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి చిన్న చిన్న పరిశ్రమల ద్వారానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటిఐ, డిప్లొమా చదివిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు రాయితీల రూపంలో రూ.800 కోట్లకు పైగా బకాయి పడిందని ఆయన గుర్తు చేశారు. వీటిని తీర్చడంతో పాటు, కోవిడ్‌–19, లాక్‌డౌన్‌ వల్ల ఆ పరిశ్రమలకు వెసులుబాటు కల్పించేందుకు దాదాపు రూ.188 కోట్ల మూడు నెలల విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ ఛార్జీలు మాఫీ చేశామని సీఎం తెలిపారు.

 ఇంకా రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రూ.200 కోట్ల వరకు పరిశ్రమలకు వెసులుబాటు కల్పించామన్నారు. ఆయా పరిశ్రమలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అతి తక్కువ వడ్డీ (6 నుంచి 8 శాతం) తో వర్కింగ్‌ క్యాపిటల్‌గా రుణ మంజూరు చేసినట్టుగా ఆయన తెలిపారు.

ఇంకా రుణాల చెల్లింపులపై 6 నెలల మారటోరియమ్‌తో పాటు, మూడేళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. ప్రభుత్వానికి ఏటా అవసరమైన దాదాపు 360 రకాల వస్తువులు, ఇతర సామాగ్రిలో 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచి తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.

చిన్న చిన్న పరిశ్రమలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అందుకే దాదాపు రూ.1100 కోట్లతో ఈ ఏడాది కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.  వచ్చే ఏడాది స్పిన్నింగ్‌ మిల్లులకు చేయూత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు దాదాపు రూ.4 వేల కోట్ల బకాయి పెట్టిందని ఆయన విమర్శించారు.

 రాష్ట్ర ఆర్థికస్థితి బాగాలేకున్నా, ఈ ఏడాది ఎంఎస్‌ఎంఈలకు సహాయం చేశామన్నారు. రూ.827 కోట్లు గత ప్రభుత్వ బకాయిలు తీర్చడమే కాకుండా, మొత్తం రూ.1100 కోట్లతో కార్యక్రమం తీసుకొచ్చినట్టుగా తెలిపారు.

 వచ్చే ఏడాది స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.1000 కోట్లు ఇవ్వనున్నట్టుగా సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వం మాట మీద నిలబడితేనే, ఎవరైనా పెట్టుబడులకు ముందుకు వస్తారని ఆయన వివరించారు.

ప్రభుత్వం మాట చెప్తే  ఆమాట మీద ప్రభుత్వం నిలబడుతుందని అనుకుంటేనే తప్ప పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. 
ఆంధ్రప్రదేశ్‌మీద మళ్లీ విశ్వసనీయత రావాలన్నారు. ప్రభుత్వం చేసే సహాయం వల్ల సంపూర్ణంగా మంచి జరుగుతుందని నమ్ముతున్నామని ఆయన తెలిపారు.

ఎంఎస్ఎంఈలకు సంబంధించిన బాగోగులను చూసేందుకు జాయింట్ కలెక్టర్ ను నియమించినట్టుగా సీఎం తెలిపారు. పనుల కోసం అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు.

click me!