
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమంపై మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజవర్గ ఇంచార్జ్‌లతో సీఎం జగన్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కనబరిచిన పనితీరు, వారి దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చేసిన కృషికి సంబంధించి డేటాను ఈ సందర్భంగా ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ నెల 7నుంచి ప్రారంభించనున్న ‘‘జగనన్నే మా భవిష్యత్తు’’ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. గృహ సారథులపై కూడా పార్టీ శ్రేణులతో సీఎం జగన్ చర్చించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల సంవత్సరంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలని సూచించినట్టుగా తెలిసింది. అందుకే గడప గడపకు కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. నెలలో కనీసం 25 రోజులు గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనాలని.. ప్రజల మధ్యలో ఉండాలని చెప్పారు. ఆగస్టు వరకు గడప గడపకు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. సెప్టెంబర్ నుంచి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు.
మనం మారీచులతో యుద్దం చేస్తున్నామని.. అది గజ దొంగల ముఠా అని విమర్శించారు. 60 మంది ఎమ్మెల్యేలను మారుస్తారని విపక్షాలు దుష్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యే పేరుతో మరి విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేను పొగ్గొట్టుకోవాలని అనుకోవడం లేదని చెప్పారు. ప్రతిపక్షాల రుమార్లను తిప్పి కొట్టాలని.. సోషల్ మీడియాను బాగా వాడుకోవాలని సూచించారు. వాలంటీర్లు, గృహ సారథులు ఏకమైతే విజయం మనదేనని కూడా కామెంట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని.. లేకపోతే కోట్లాది మంది ప్రజలు నష్టపోతారని కామెంట్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని ఏవో మాటలు చెబుతున్నారని విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. 21 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే.. 17 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందని అన్నారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వాపు చూపించి.. అది బలుపు అని అంటున్నారని విమర్శించారు. ‘‘మనం గ్రాఫ్ పెంచుకోవాలి’’అని వైసీపీ నాయకులకు సూచించారు. అయితే గతంలో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో మాదిరిగా.. ఈసారి ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా సీఎం జగన్ హెచ్చరికలు జారీచేయకపోవడం గమనార్హం.