విపత్తు వేళ అద్భుతంగా పని చేశారు.. సీఎం జగన్‌పై కేంద్ర బృందం ప్రశంసలు.. ‘మా సహకారం ఉంటుంది’

By telugu teamFirst Published Nov 29, 2021, 6:59 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టాలను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించింది. విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పని తీరు భేష్ అని కితాబిచ్చింది. సీఎం జగన్‌కు యువ, డైనమిక్ అధికారులు ఉన్నారని, వారు సకాలంలో వేగంగా సహాయక చర్యలు తీసుకున్నారని పేర్కొంది. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని వివరించింది. కాగా, వరదల కారణంగా తేమ శాతం పెరిగి ఉండవచ్చని, కాబట్టి, ధాన్య కొనుగోలు చేసేటప్పుడు నిబంధనలు సడలించాలని సీఎం జగన్ కోరారు.
 

అమరావతి: Andhra Pradesh రాష్ట్రంలో వరద ప్రభావిత(Flood Affected) ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. క్షేత్రస్థాయి పర్యటిన చేసిన తర్వాత ఆ బృందం సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan)తో భేటీ అయింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించింది. విపత్తు వేళ్ల రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పని చేసిందని వివరించింది. సీఎం జగన్ దగ్గర యువ అధికారులు ఉన్నారని, వదర సహాయక చర్యల్లో వారు వేగంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు సహకరించారని తెలిపింది. కేంద్రం నుంచీ అవసరమైన మేరకు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చింది. ఇదే సమావేశంలో సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని వరి పంట కొనుగోలుపై విజ్ఞప్తులు చేశారు. భారీ వర్షం, వరదల కారణంగా ధాన్యంలో తేమ శాతం పెరిగి ఉంటుందని, కాబట్టి, తేమ సహా పలు నిబంధనలను సడలించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.

కేంద్ర హోం శాఖ పరిధిలోని ఎన్‌ఎండీఏ సలహాదారు కునాల్ సత్యార్థి సీఎంతో సమావేశంలో కీలక వివరాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా కడప జిల్లాలో వర్షాలు భారీగా కొట్టడంతో వరదలు ఎక్కువగా సంభవించాయని వివరించారు. తాము మూడు రోజులపాటు పర్యటించామని, దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామని అన్నారు. కడపకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. సాధారణంగా అక్కడ వరదలు వచ్చే ప్రాంతం కాదు కాబట్టి, అందుకు తగ్గ నిర్మాణాలు, వాగులు, వంకలు లేవని వివరించారు. ఇంతస్థాయిలో వరదను తీసుకెళ్లే సామర్థ్యం గల నదులూ అక్కడ లేవని తెలిపారు. కడప జిల్లాలో నష్టం ఎక్కువ ఉందని, అన్నమయ్య ప్రాజెక్టు తెగిన చోట నష్టం అపారంగా ఉన్నదని చెప్పారు. చిత్తూరు, నెల్లూరుల్లోని కొన్ని ప్రాంతాల్లో వరద నష్టం ఎక్కువగా ఉన్నదని తెలిపారు. అయితే, సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు హర్షనీయమని అన్నారు.

Also Read: ఏపీలో సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక, స్కూళ్లకు సెలవు

అంకిత భావంతో పనిచేసే అధికారులు సీఎం జగన్‌కు ఉన్నారని, వారంతా తమ పర్యటనలో బాగా సహకరించారని కునాల్ సత్యర్థి వివరించారు. యువ, డైనమిక్ అధికారులు ఉన్నారని, వారు వరద ప్రభావితం ప్రాంతాల్లో చురుకుగా సహకరించారని తెలిపారు. విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. భారీ విపత్తు అయినప్పటికీ అత్యవసర సేవలను వేగంగా పునరుద్ధరించడంలో సఫలం అయ్యారని చెప్పారు. ఇంత త్వరగా విద్యుత్ మళ్లీ రావడం సహజంగా జరగదని అన్నారు. సకాలంలో నిధులు కలెక్టర్లకు అందించడం, వారు సహాయక కార్యక్రమాలకు వినియోగించడం చకచకా జరిగిపోయాయని వివరించారు.

ఈ సమావేశంలో సీఎం జగన్ కూడా రాష్ట్ర పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించారు. ఇలాంటి విపత్తు రావడం బాధాకరమని, నష్ట అంచనాల కోసం పర్యటనకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాము పంపిన నష్టం వివరాలు స్పష్టమైనవని, అందులో పెంపు లేదని సీఎం జగన్ అన్నారు. క్షేత్రస్థాయిలో నష్టాలను అంచనా వేసే వ్యవస్థ తమకు ఉన్నదని వివరించారు. వరదలు, వర్షాల కారణంగా పంట నష్టం జరిగిందని, ఉన్న పంటలోనూ తేమ పెరిగి ఉండవచ్చని అన్నారు. కాబట్టి, ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కొవిడ్ కట్టడి చర్యలతో నిధులు నిండుకున్నాయని, కాబట్టి, ఇతర పనుల కోసం నిధులు అడ్‌హాక్ పద్ధతిన కేంద్రం విడుదల చేయాలని కోరారు.

click me!