ప్రతిపక్షాలకు దేవుడు ఆ బుద్ది, జ్ఞానం ఇవ్వాలి: విద్యాదీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published Nov 30, 2022, 1:32 PM IST
Highlights

రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కొరవడిన ఆలోచన శక్తి, వివేకం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు. నవరత్నాలతో పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

అక్షరాలు చదవడం, రాయడం మాత్రమే విద్యకు పరమార్థం కాదని.. ప్రతి ఒక్కరు తనకు తానుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తిని ఇవ్వగలగడమే విద్యకు పరమార్థం అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అన్నారని సీఎం జగన్‌ చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కొరవడిన ఆలోచన శక్తి, వివేకం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విద్యా దీవెన పథకం జూలై- సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. 

పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివించదని వాదించే మనషుల సంస్కారాలు మారాలని దేవుడిని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. తమ వారు మాత్రమే బాగుపడాలనే మనస్థత్వం నుంచి మనుషులు అంతా ఒకటేనన్న మానవత్వవాదం రావాలని దేవుడిని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. ప్రతిపక్షాలు వారి భూములు ఉన్న ప్రాంతంలోనే రాజధాని కట్టాలని భావిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నిరూపేద వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే వాదనలు మార్చగలిగే చదువు, జ్ఞానం వారికి ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. 

నవరత్నాలతో పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ బటన్ నొక్కడం ద్వారా ప్రజలకు మంచి జరిగితే.. వాళ్లకు పుట్టగతులు ఉండవని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలకం అయిపోతుందని చెబుతారు.. ఇదే రాష్ట్రం వీళ్లు అధికారంలోకి ఉన్నప్పుడు అమెరికా అంటా అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

రైతులను మోసం చేసిన చంద్రబాబు ఈ రోజు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడని.. పిల్లలను మోసం చేసిన చంద్రబాబు నేడు చదువు గురించి మాట్లాడుతున్నాడని.. అక్కాచెల్లమ్మలకు ద్రోహం చేసిన చంద్రబాబు మహిళా సాధికరత గురించి మాట్లాడుతున్నాడని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను దగా చేసిన చంద్రబాబు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడని.. అవన్నీ చూసి ఇదేం ఖర్మరా బాబూ అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. 

పేదలు బాగుపడటం తట్టుకోలేక పెత్తందారులు దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోవాలని కోరారు. ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండాలని అన్నారు. మారీచులతో, రాక్షసులతో, చెడిపోయిన వ్యవస్థతో యుద్దం చేస్తున్నామని అన్నారు. 

గతంలో పాలకులు ఎందుకు బటన్ నొక్కి నేరుగా డబ్బులు వచ్చేలా ఎందుకు చేయకలేకపోయారని ప్రశ్నించారు. గతంలో గజదొంగల ముఠా ఉండేదని.. దుష్టచతుష్టయం దోచుకో, పంచుకో, తినుకో అని రాష్ట్రాన్ని దోచేశారని ఆరోపించారు. అందుకే ఆరోజు ప్రజలకు మంచి చేయాలని ఎవరూ ఆలోచన చేయలేదని అన్నారు. తనకు పొత్తు ప్రజలతోనేనని అన్నారు. 

వాళ్ల మాదిరిగా టీవీ చానళ్లు, పేపర్లు, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు గానీ.. నిజాయితీ ఉందని అన్నారు. ఏదైతే చెబుతానో.. అది తప్పకుండా చేస్తానని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించానని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన 98 శాతం హామీలను అమలు చేసినట్టుగా చెప్పారు. గతంలో మేనిఫెస్టోలు చెత్తబుట్టలో ఉండేవి.. ఆ పరిస్థితిని మార్చిన వ్యక్తి మీ బిడ్డేనని చెప్పారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకోచ్చామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉండాలని  కోరుతున్నట్టుగా చెప్పారు. 


విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. పేదలకు చదువును హక్కుగా మార్చామని చెప్పారు. చంద్రబాబు హయాంలో పెట్టిన  బకాయిలు రూ. 1,776 కోట్లు చెల్లించామని తెలిపారు. జగనన్న  విద్యాదీవెన కింద రూ. 9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు అందించామని చెప్పారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ. 694 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. 

పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా భావించమని.. ఆస్తిగా భావిస్తామని చెప్పారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని అన్నారు. కుటుంబాల తలరాత మారాలన్నా, పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం అని చెప్పారు. పేదరికం చదువుకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెచ్చారని తెలిపారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడ్డారని అన్నారు. 

ఆ తర్వాత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చాయని విమర్శించారు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని తెలిపారు. విద్యాదీవెనకు తోడుగా  జగనన్న వసతి దీవెన కూడా ఇస్తున్నామని చెప్పారు. పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గుకు వచ్చేలా సీబీఎస్‌ఈ, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని చెప్పారు. గోరుముద్ద, విద్యా కానుక, నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్పు వచ్చిందన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని భరోసా ఇస్తున్నానని తెలిపారు. పిల్లల చదువులకు తాను  అండగా ఉంటానని చెప్పారు. 

click me!