‘మీ కళ్ల ముందే రిజిస్ట్రేషన్లు.. వివాదాలకు స్వస్తి పలకాలన్నదే లక్ష్యం’.. సీఎం వైఎస్ జగన్

By Sumanth KanukulaFirst Published Jan 18, 2022, 12:32 PM IST
Highlights

ప్రజల ఆస్తులను వారి కళ్ల ముందే రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) తెలిపారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన సమగ్ర భూసర్వే రికార్డులను సీఎం జగన్ మంగళవారం ప్రజలకు అంకితం చేశారు.

ప్రజల ఆస్తులను వారి కళ్ల ముందే రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) తెలిపారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన సమగ్ర భూసర్వే రికార్డులను సీఎం జగన్ మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. రీసర్వే పూర్తైన గ్రామాల్లో.. 37 చోట్ల స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలను సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే జరుగుతుందని చెప్పారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. 

‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకాన్ని 13 నెలల క్రితం ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామంలో.. ప్రతి ఒక్కరి భూమిని 2023 కల్లా.. సమగ్ర ఆధునిక పద్దతుల్లో రీసర్వే చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా చెప్పారు. రీసర్వే చేయడమే కాకుండా ఒక యూనిక్ ఐడీ నెంబర్ కలిగిన కార్డును క్రియేట్ చేయడం.. డాటా మొత్తం సబ్ డివిజన్‌తో పాటుగా అప్‌డేట్ చేయనున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత పట్టా డాక్యుమెంట్స్‌‌ను భూ యజమానుల చేతిలో పెట్టనున్నట్టుగా తెలిపారు. ప్రతి గ్రామంలో వివాదాలకు తావులేకుండా రిజిస్ట్రేషన్లు చేపడతాం.

దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే చేపట్టాం. తొలి దశలో 51 గ్రామాల్లోని 21,404 భూ కమతాల్లో రీసర్వే పూర్తి చేశాం. భూముల రీసర్వే పూర్తయిన 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో మీ కళ్లముందే రిజిస్ట్రేషన్‌లు జరగనున్నాయి. తొలి దశలో 12,776 మంది భూ యజమానుల భూ కమతాల్లో రీసర్వే పూర్తి చేశాం. 29,563 ఎకరాలను రీసర్వే చేసి.. 3,304 అభ్యంతరాలకు పరిష్కారం చూపించడం జరిగింది. భూముల రికార్డులు ట్యాంపరింగ్ జరుగుతుందని వింటున్నాం. ఇంటి స్థలం, పొలాలు.. రికార్డులు, రిజిస్ట్రేషన్‌లలో వేరే మాదిరిగా ఉంటున్నాయి. రికార్డుల్లో ఒక మాదిరిగా.. భూముల వద్దకు వెళ్తే కొలతల్లో తేడా ఉంటుంది’ అని సీఎం జగన్ తెలిపారు. 

సివిల్ వివాదాలు పెరిగిపోతున్నాయని సీఎం జగన్ చెప్పారు. సివిల్ వివాదాలకు స్వస్తి పలకాన్నదే శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం లక్ష్యమని తెలిపారు. అక్రమణలు, నకిలీ రిజిస్ట్రేషన్లు, కబ్జాలకు అడ్డుకట్ట వేస్తున్నట్టుగా వెల్లడించారు. భూములకు సంబంధించి నిర్దిష్ట హద్దును ఇవ్వగలగాలి అని చెప్పారు. భూముల రీసర్వే కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.. 45 వేల సర్వే బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. 

అత్యాధునిక సాంకేతిక పరిజానంతో భూముల రీసర్వే పనులు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. భూ యజమానికి తెలియకుండా రికార్డులు మార్చే ప్రసక్తే ఉండదని అన్నారు. సర్వే చేసేటప్పుడు భూ యజమానిని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. అభ్యంతరాలు ఉంటే మండలస్థాయిలోనే పరిష్కరించుకోవచ్చని చెప్పారు. 

click me!