
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. విద్యుత్ వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలిసారిగా “ట్రూ డౌన్” విధానం అమలు చేసి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నవంబర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. యూనిట్‌కు 13 పైసల చొప్పున కరెంట్ ధర తగ్గించడంతో వినియోగదారులకు సుమారు ₹923 కోట్ల భారం తగ్గనుంది.
చంద్రబాబు వివరించిన ప్రకారం, గత 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణ ఫలితంగా ఈ నిర్ణయం సాధ్యమైంది. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ విధానం ద్వారా పీక్ అవర్స్‌లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసే పరిస్థితిని నివారించామని ఆయన తెలిపారు. దీంతో స్వల్పకాలిక కొనుగోళ్లలో భారీ ఖర్చు తగ్గిందని చెప్పారు.
అలాగే, రైతులకు పీఎం కుసుమ్ స్కీం ద్వారా ఉచిత సౌర విద్యుత్, ఎస్సీ/ఎస్టీలకు పీఎం సూర్యఘర్ కింద ఉచిత సోలార్ సదుపాయం, బీసీ వినియోగదారులకు గరిష్టంగా ₹98 వేల సబ్సిడీ లభిస్తున్నట్లు చెప్పారు. అదనంగా, 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం ఏర్పాటు జరుగుతోందని తెలిపారు.
రాబోయే రోజుల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ కింద మరిన్ని విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పి ప్రజలకు మరింత చౌకగా కరెంట్ అందించనున్నామని హామీ ఇచ్చారు. “విద్యుత్ రంగంలో మార్పు ఇప్పటికే మొదలైంది. ఈ మార్పు భవిష్యత్‌లో మరిన్ని అద్భుత ఫలితాలను ఇస్తుంది” అని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎంపీలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక దర్శనం అనంతరం సీఎం దంపతులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.26 కోట్లతో అన్నప్రసాద భవనం, రూ.27 కోట్లతో కొత్త ప్రసాద కేంద్రం, రూ.5 కోట్లతో పూజా మండపం, రూ.14 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ వంటి నిర్మాణాలు త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. 2027 గోదావరి, 2028 కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని సీఎం ప్రకటించారు. అక్టోబర్ 19 వరకు సాగనున్న ఈ కార్యక్రమాల్లో 65 వేల సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులు, ఔషధాలు, విద్యా సామగ్రి వంటి వాటిపై పన్నులు తగ్గిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. దీపావళి సందర్భంగా జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక సంబరాలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.