బాబాయ్ అబ్బాయ్ ల మధ్య మళ్లీ వివాదం మెుదలైంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఒకే పార్టీలో వీరిద్దరు ఇమడలేకపోతున్నారు. బాబాయ్ కి పోటీగా అబ్బాయ్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు హోదాలో తనకు చెప్పకుండా అబ్బాయ్ దూసుకుపోతున్నాడని బాబాయ్ అలిగాడు.
విశాఖపట్నం: బాబాయ్ అబ్బాయ్ ల మధ్య మళ్లీ వివాదం మెుదలైంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఒకే పార్టీలో వీరిద్దరు ఇమడలేకపోతున్నారు. బాబాయ్ కి పోటీగా అబ్బాయ్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు హోదాలో తనకు చెప్పకుండా అబ్బాయ్ దూసుకుపోతున్నాడని బాబాయ్ అలిగాడు.
క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో ఇలా వ్యవహరిస్తే పార్టీకి నష్టమంటూ బాబాయ్ అబ్బాయ్ ని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పార్టీ అధినేతకు ఓ లేఖ రాసేశారు. అబ్బాయ్ పై ఫిర్యాదు చేసేశారు. అబ్బాయ్ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
undefined
ఇంతకీ ఆ బాబాయ్ అబ్బాయ్ ఎవరనుకుంటున్నారో ఇంకెవరు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన చింతకాయల వారసులు. అదేనండీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు సోదరుడు మున్సిల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు, కొడుకు విజయ్. వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరు తారా స్థాయికి చేరుకుంది.
గతంలో బాబాయ్ అబ్బాయ్ ల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. అయితే మంత్రి అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని సయోధ్య కుదుర్చారు. అప్పుడు కూడా చంద్రబాబు దృష్టికి వెళ్లింది కానీ పెద్దాయన అయ్యన్నకు వదిలేశారు.
అప్పటి నుంచి ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి అయ్యన్న పాత్రుడు తన కుమారుడుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ్ముడుతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అయ్యన్న కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. అయ్యన్న తనయుడు విజయ్ నర్సీపట్నం పట్టణ పరిధిలో జోక్యం చేసుకుంటుండటం బాబాయ్ సన్యాసిపాత్రుడుకి చిర్రెత్తుకొస్తుంది.
గత కొద్ది రోజులుగా మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ అతని అనుచరులతో ప్రత్యేక వర్గంగా ఏర్పడి గ్రామదర్శిని పూర్తి కాకుండానే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారట. పట్టణ అధ్యక్షుడిగా తనకు, ఇతర కమిటీలకు కనీస సమాచారం లేకుండా ఏకపక్షంగా ఇంటింటికీ తెలుగుదేశం నిర్వహిస్తున్నారని బాబాయ్ సన్యాసిపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయ్ వ్యవహారశైలిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. పట్ల నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని సన్యాసిపాత్రుడు లేఖలో తెలిపారు. విజయ్ కు వ్యతిరేకంగా మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు సీఎంకు రాసిన లేఖ బయటకు రావడంతో పార్టీ శ్రేణుల్లో కలకలం సృష్టించింది.
పార్టీ పట్టణ అధ్యక్షుడి హోదాలో సీఎంకు అడ్రస్ చేస్తూ లేఖ రాశారు. విజయ్ ఏకపక్షంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతన్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ కార్యక్రమాలు చేయాలా.. వద్దా? అనే అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు.
అయితే నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ ఏర్పడినప్పటి నుంచి రూరల్ ప్రాంతం కంటే మున్సిపాలిటీలో ఎక్కువ మెజారిటీ ఇచ్చి పార్టీ విజయానికి కారకులయ్యారని లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తనకుగాని, బూత్ కన్వీనర్లకుగాని తెలియకుండా విజయ్ కొత్తగా అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు వెల్లడించారు. మున్సిపాలిటీలో అధిష్టానం ఆదేశాల మేరకు వార్డు, సంకల్ప కమిటీలతో గ్రామదర్శిని విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు సన్యాసిపాత్రుడు లేఖలో పేర్కొన్నారు.
చింతకాయల విజయ్‌కు ఎటువంటి పార్టీ పదవి లేదని, ఈ నాలుగేళ్ల కాలంలో ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ప్రజలతో మమేకం కావడం కానీ చెయ్యలేదని తెలిపారు. కేవలం మంత్రి తనయుడు హోదాలో హఠాత్తుగా ఈ కార్యక్రమాన్ని సొంత అనుచరులతో నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
ఇలాగే వ్యవహరిస్తే నియోజకవర్గంలో పార్టీ కేడర్ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం 2019లో జరిగే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఈ పరిస్థితిని చక్కదిద్దాలని లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.
బాబాయ్ అబ్బాయ్ ల మధ్య ఆధిపత్య పోరు మంత్రి అయ్యన్నపాత్రుడుకు పెద్ద తలనొప్పిగా మారింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైన తనను ఈ ఇంటిపోరు పెద్ద సమస్యగా మారిందని ఆవేదన చెందుతున్నారు. అటు తోడబుట్టిన తమ్ముడు ఇటు రక్తంపంచుకుపుట్టిన కొడుకు ఇద్దరిని ఎలా ఒప్పించాలో తెలియక మధ్యలో అయన్నపాత్రుడు నలిగిపోతున్నారట.