తాడికొండ వైసీపీలో వర్గ విభేదాలు.. ఉండవల్లి శ్రీదేవికి నిరసన సెగ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముందే అసమ్మతి స్వరాలు

By Siva KodatiFirst Published Dec 30, 2022, 9:12 PM IST
Highlights

తాడికొండ వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాడికొండ, తుళ్లూరు మండలాల వైసీపీ నేతలతో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ , ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం నినాదాలు చేసింది. 

ఓ వైపు వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో సీఎం జగన్ శ్రేణుల్ని సిద్ధం చేస్తుంటే.. నియోజకవర్గంలో నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోటా నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. కొందరైతే బాహాటంగానే పార్టీలోని తమ ప్రత్యర్ధులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలోని తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవికి , అసమ్మతి నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు నెలకొన్నాయి. తాజాగా శుక్రవారం తాడికొండ, తుళ్లూరు మండలాల వైసీపీ నేతలతో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ , ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలంతా ఎమ్మెల్యే శ్రీదేవి వ్యవహారశైలిపై ఆరోపణలు గుప్పించారు. ఆమె మాట్లాడే ప్రయత్నం చేయగా కొందరు వ్యతిరేక నినాదాలు చేశారు. 

గతంలో తాడికొండ నియోజకవర్గం వైసీపీ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌‌ను నియమించడంపై ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియమాకాన్ని ఉండవల్లి శ్రీదేవి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొన్నామధ్య ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అనుచరులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. డొక్కాకు వ్యతిరేకంగా శ్రీదేవి అనుచరులు నినాదాలు చేయగా.. మరోవైపు శ్రీదేవికి వ్యతిరేకంగా డొక్కా‌ వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో ఈ తాడికొండ పంచాయతీ అధిష్టానం వరకు వెళ్లింది. 

Also Read : నా పేరు విన్నా, నా ఫోటో చూసినా ఎందుకంత భయం : ఆనం రాంనారాయణ రెడ్డికి నేదురుమల్లి కౌంటర్

అటు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోనూ వైసీపీ వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నర్సరావుపేటకు కాసు రాక మాకెంతో ముఖ్యమంటూ కొటేషన్స్‌తో ఆయన వర్గీయులు ఫ్లెక్సీలు పెట్టారు. అంతేకాకుండా వేలాది కరపత్రాలను పంపిణీ చేశారు. ఇది పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి కౌంటర్ అన్నట్లుగా లింగంగుట్లలో గతంలో కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రిగా వున్నప్పుడు ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. దీంతో పేట వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. గురజాల ఎమ్మెల్యేగా వున్న కాసు మహేశ్ రెడ్డి... నర్సరావుపేట టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఎమ్మెల్యేల అనుచర వర్గం తరచుగా ఫ్లెక్సీ వార్‌కు దిగుతోంది. ఇది ఎంత వరకు వెళ్తుందన్నది ఆసక్తిగా మారింది.

click me!