చంద్రబాబు వ్యాఖ్యలపై భగ్గుమన్న క్రైస్తవ సంఘాలు... నిరసనలకు పిలుపు

By Arun Kumar PFirst Published Jan 19, 2021, 9:33 AM IST
Highlights

భిన్నత్వంలో ఏకత్వంగా యావత్ భారత దేశం నడుస్తున్న నేపథ్యంలో మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారని ఏపీ బిషప్స్ కౌన్సిల్ & పాస్టర్స్ ఫెలోషిప్ లీడర్స్ ఫోరమ్ నాయకులు, క్రైస్తవులు భగ్గుమన్నారు.

విజయవాడ: మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా టిడిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులపై అనుచిత వాఖ్యలు చేశాడంటూ క్రైస్తవ మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు క్రైస్తవ సంఘాలు తెలిపాయి. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దళిత క్రైస్తవ ఆత్మ గౌరవ సభ  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

భిన్నత్వంలో ఏకత్వంగా యావత్ భారత దేశం నడుస్తున్న నేపథ్యంలో మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారని ఏపీ బిషప్స్ కౌన్సిల్ & పాస్టర్స్ ఫెలోషిప్ లీడర్స్ ఫోరమ్ నాయకులు, క్రైస్తవులు భగ్గుమన్నారు. చంద్రబాబు క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతినే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో క్రైస్తవ మత పెద్దల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో సమావేశమయ్యారు. ఇందులో బిషప్ రెబ్బా ఇమ్మానుయేలు , పాస్టర్ బొంతపురి రవిప్రకాష్ , అప్పికట్ల జీవరత్నం, కర్రా హనోకు బెంజిమెన్ తదితరులు పాల్గొన్నారు. 

read more  పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారు: బాబుపై మంత్రి కొడాలి ఫైర్

ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ... మానవ సమాజంలో మార్పు కోసం, సమాజ శ్రేయస్సు కోసం పని చేసే క్రైస్తవులపై ఇలాంటి వాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మత సామరస్యానికి పునాదులు వేయాల్సిన వారు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా చేసిన వాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, పట్టణ పరిధిల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, క్రైస్తవ ఆత్మ గౌరవ సభ లు, వివిధ మేధావి వర్గాలతో చర్చా గోష్టిలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. హిందువులు, క్రైస్తవులు ముస్లింలు అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే మధ్యలో  చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేసి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటని అన్నారు. భారత రాజ్యాంగ విలువలు మంట గలిపెలా ప్రవర్తించడం గర్హనీయమని పేర్కొన్నారు.

click me!