అందరి చూపు వారిపైనే: జగన్‌తో చిరంజీవి భేటీ

By narsimha lodeFirst Published Oct 14, 2019, 7:25 AM IST
Highlights

సైరా సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాను వీక్షించాలని చిరంజీవి పలువురు ప్రముఖులను కోరుతున్నారు. ఇదే విషయమై ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి భేటీ కానున్నారు.

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ ను సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి సోమవారం నాడు మధ్యాహ్నం కలవనున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాను వీక్షించాలని కోరేందుకు చిరంజీవి సీఎం జగన్ ను ఆహ్వానించనున్నారు.

వారం రోజుల క్రితమే సీఎం జగన్ ను కలవాలని చిరంజీవి భావించారు.జగన్ అపాయింట్ మెంట్ కూడ ఖరారైంది.అయితే కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమాన్ని సోమవారానికి వాయిదా వేశారు. 

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు చిరంజీవి. అదే సమయంలో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

అదే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు.

ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న విధానాలపై పవన్ కళ్యాణ్ తీవ్రంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఈ తరుణంలోనే సైరా నరసింహారెడ్డి సినిమా తిలకించాలని సీఎం జగన్ ను చిరంజీవి కోరేందుకు సోమవారం నాడు అమరావతికి రానున్నారు.

సోమవారం మధ్యాహ్నం ఇద్దరు కలిసి లంచ్ చేయనున్నారు. ఏపీ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంపై వైసీపీ కేంద్రీకరించి పనిచేస్తోంది.ఈ తరుణంలో చిరంజీవి వైఎస్ జగన్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించకొంది.

ఈ భేటీ కేవలం సినిమాకే పరిమితమని చిరంజీవి సన్నిహితులు చెబుతున్నారు. ఐదేళ్లుగా చిరంజీవి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

అయితే మరో రెండు సినిమాల్లో నటించేందుకు చిరంజీవి సిద్దంగా ఉన్నారు. ఈ మేరకు ఆయా సినిమాలకు కూడ ఆయన ఒప్పుకొన్నారని సమాచారం.దీంతో రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉంటారనే అభిప్రాయాలు కూడ  లేకపోలేదు. ఈ విషయమై చిరంజీవి మనసులో ఏముందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.


 

click me!