ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు గడిచిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆయనను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు గడిచిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆయనను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ క్రమంలో వారిద్దరు దేని గురించి చర్చించుకున్నారు. ఉన్నపళంగా ఈ మీటింగ్ ఎందుకు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. వీరిద్దరి భేటీలో ప్రదానంగా సైరా సినిమాకు వినోదపన్ను మినహాయింపుపై చర్చ జరిగినట్లు సమాచారం. ఏపీలోని కాపు నేతల అంశంపైనా జగన్.. చిరంజీవితో చర్చించారట.
ఇప్పటికే టీడీపీలో ఉన్న కాపు నేతలను వైసీపీకి మరింత దగ్గర చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినాయకత్వం పావులు కదుపుతోంది. చిరంజీవి అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
అంతకు మందు గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న చిరంజీవి దంపతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి రెడ్డిలు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జగన్‌ను మెగాస్టార్ శాలువా కప్పి సన్మానించారు. జగన్మోహన్ రెడ్డి.. చిరంజీవికి బొబ్బిలి వీణను బహుకరించారు. అనంతరం జగన్.. చిరంజీవి దంపతులు కలిసి భోజనం చేశారు. ఈ సమయంలో సైరా చిత్రానికి సంబంధించిన విశేషాలనే ఎక్కువగా మాట్లాడినట్లు సమాచారం.
సినిమా చాలా బాగా తీశారని సీఎం ప్రశంసించారు. భేటీ అనంతరం స్పందించిన మెగాస్టార్.. రాజకీయాలకు అతీతంగానే తమ భేటీ జరిగిందని స్పష్టం చేశారు. కాగా.. చిరంజీవి విజ్ఞప్తి మేరకు రెండు, మూడు రోజుల్లో విజయవాడ పీవీపీ మాల్‌లో జగన్ సినిమాను వీక్షించే అవకాశం ఉంది.