చిరంజీవి పొలిటికల్ కాల్షీట్లు ఎవరికీ ? జనసేనకా.. కాంగ్రెస్‌కా..?

First Published 31, Jul 2018, 4:13 PM IST
Highlights

రాబోయే ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ కొరత కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. దీనిని భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభించిన ఉమెన్ చాందీ.. మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు జరుపుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.

సీమాంధ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఆరు దశాబ్ధాల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్‌కు 2014 ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతవ్వగా.. బరిలో దింపడానికి అభ్యర్థులు కూడా కరువయ్యారంటే కాంగ్రెస్‌పై ప్రజల్లో ఏ రేంజ్‌లో ఆగ్రహం వుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఏపీ స్టామినాను అర్థం చేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో పునర్వైభవాన్ని సాధించాలని భావించి కసరత్తు ప్రారంభించింది. 

దీనిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని నియమించింది. ఆయన వస్తూవస్తూనే కాంగ్రెస్‌ను వీడిపోయిన వారంతా తిరిగి రావాలని కోరారు. సీనియర్లు, మాజీలకు రాయబారం పంపి పార్టీని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.. అలా ఆయన కృషి ఫలించి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అయితే రాబోయే ఎన్నికలకు ఒక స్టార్ క్యాంపెయినర్ కొరత ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. 

దీనిని భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభించిన ఉమెన్ చాందీ.. మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు జరుపుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. అయితే ఎంపీ ఉన్నప్పుడే పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరించి.. పదవీకాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్‌కు అనధికారింగా రాజీనామా చేసినట్లు, ఇక రాజకీయాల నుంచే తప్పుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు చిరు. అలాంటి చిరు తిరిగి కాంగ్రెస్ తరపున పనిచేస్తాడని ఏపీ పీసీసీ నేతలు వాదిస్తున్నారు. 

మొన్నామధ్య ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘‘ చిరు నాతో, రాహుల్‌తో మాట్లాడాడని.. ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి పార్టీ తరపున ప్రచారం చేస్తాడని అన్నట్లుగా’’ చెప్పారు. ప్రస్తుతం సినిమాల తప్పించి మరో పని పెట్టుకోకూడదని బలంగా భావిస్తున్నారు మెగాస్టార్. కాకపోతే కాంగ్రెస్‌తో బంధం తెంపుకోవడం ఇష్టం లేదని కొందరు సన్నిహితుల వద్ద అన్నట్టుగా చర్చ జరుగుతోంది. అందుకే ఆ పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు రెండు నెలలు పనిచేసి పెట్టాలని భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా అన్నయ్య మద్ధతు కోసం ఎదురు చూస్తున్నాడు. చిరంజీవి కాంగ్రెస్‌కు వీడ్కోలు చెప్పి... జనసేనలో చేరాలని.. చిరు, పవన్ అభిమానులు  కలిస్తే తమను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని జనసేన కార్యకర్తలు సైతం అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో చిరంజీవి ఎలాంటి స్టెప్ వేయబోతున్నాడన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Last Updated 31, Jul 2018, 4:13 PM IST