
అందరూ అనుకున్నట్లుగానే చిన్నమ్మ శశికళే పార్టీ పగ్గాలు అందుకున్నారు. జయలలిత మృతి దగ్గర నుండి ఏఐఏడిఎంకె ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టేది ఎవరనే విషయమై తమిళనాడులో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. అయితే, గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళకే పార్టీ నాయకత్వ పగ్గాలు అందించాలని ఏకగీవ్ర తీర్మానం జరిగింది.
అనంతరం, పార్టీ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేరుగా పొయెస్ గార్డెన్ కు వెళ్లి పార్టీ తీర్మానం కాపీని అందించారు. ‘ప్రస్తుత పరిస్ధితుల్లో మీరు తప్ప పార్టీని నడిపించేందుకు ఎవరూ లేర’ని సీఎం పేర్కొన్నట్లు సమాచారం.
అదేవిధంగా గడచిన 30 ఏళ్ళుగా జయలలితకు చేసిన సేవలకు గాను పార్టీ సర్వ సభ్య సమావేశం చిన్నమ్మకే పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు పన్నీర్ సెల్వం చెప్పారు.
దాంతో శశికళ కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు అందుకునేందుకు సుముఖత వ్యక్తం చేసారు. జనవరి 2వ తేదీన శశికళ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుండగా, తమిళనాడు రాజకీయాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కన్నేసినట్లు సమాచారం. జయలలిత మృతి తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రి బంధువుతో పాటు ఏఐఏడిఎంకెకు గట్టి మద్దతుదారుగా ఉన్న శేఖర్ రెడ్డి తదితరులపై ఐటి, ఇడి ఉన్నతాధికారులు వరుస దాడులు చేస్తున్నారు.
దాంతో తమిళనాడు విషయలో కేంద్రం ఎటువంటి వైఖరి అవలంభిస్తోందో ఓ పట్టాన అర్ధం కావటం లేదు. ఇటువంటి నేపధ్యంలోనే శశికళ పార్టీ పగ్గాలు చేపట్టటంతో రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.