ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు... ఆ బాధ్యత ప్రభుత్వానిదే: చిన్నజీయర్

By Arun Kumar PFirst Published Feb 26, 2021, 11:13 AM IST
Highlights

దేవాలయాల భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని... ఇప్పటికే ఆలయాలకు చెందిన మాన్యాలు అన్యాక్రాంతం అయ్యాయన్నారు చిన్నజీయర్ స్వామి. 

తిరుమల: ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రముఖ ఆద్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి మరోసారి స్పందించారు. ఆలయాల పరిరక్షణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్వామి స్పష్టం చేశారు. 

ఇవాళ(శుక్రవారం) చిన్నజీయర్ స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం బయటకు వచ్చినతర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాల పరిరక్షణ గురించి మాట్లాడారు. దేవాలయాల భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని... ఇప్పటికే ఆలయాలకు చెందిన మాన్యాలు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం దేవాదాయశాఖ ఆధీనంలోకి 4లక్షల 60వేల ఎకరాల భూమి వచ్చిందని చిన్నజీయర్ స్వామి తెలిపారు. 

ఆలయాలను పరిరక్షించే బాధ్యతను సంబంధిత వ్యవస్థలు సరిగ్గా నిర్వర్తించడం లేదని...అందువల్లే దేవాలయాలపై దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. స్వయంగా తానే రాయలసీమలో దాడులకు గురయిన 27 ఆలయాలను పరిశీలించానని...  ఆ ఆలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు సూచనలతో కూడిన ఓ లేఖను టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డికి అందజేసినట్లు చిన్నజీయర్ స్వామి తెలిపారు. టిటిడి ఛైర్మన్ కూడా తన సూచనలపై సానుకూలంగా స్పందించినట్లు స్వామి తెలిపారు. 

read more    ఆలయాలపై దాడులు.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించండి: రాజ్యసభలో జీవీఎల్

ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల దాడుల అంశంపై వైసిపి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించింది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ పని చేయనుంది. ప్రస్తుతం ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అశోక్ కుమార్. సిట్‌లో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు.

వీరిలో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్, ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ శ్రీధర్, సీఐడీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, మరో 12 మంది పోలీస్ అధికారులు వున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆలయాల దాడులపై ఆ బృందం దర్యాప్తు చేయనుంది. 

click me!