
కరోనా మహమ్మారి భారతదేశాన్ని వణికించిన సంగతి తెలిసిందే. తొలి విడత కంటే రెండో విడతలో కేసులు, మృతుల సంఖ్య భారీగా నమోదైంది. ముఖ్యంగా ఎందరో పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాదాపు 6,800 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనాథలైన 4,033 మంది పిల్లల వివరాలు సేకరించినట్లు ఈ మేరకు విద్యాశాఖ తెలిపింది. వారిలో 1,659 మంది ప్రభుత్వ బడులు, కళాశాలల్లో; 2,150 మంది ప్రైవేట్ బడులు, కళాశాలల్లో చదువుతున్నట్లు వెల్లడించింది.
మిగతా 524 మందిని శిశువులుగా గుర్తించినట్లు పేర్కొంది. కరోనా బాధిత పిల్లలకు ఉచిత విద్య అందించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అనాథలైన పిల్లల వివరాలు సేకరించాలని విద్యాశాఖను ఏపీ సర్కార్ ఆదేశించింది. వెంటనే పాఠశాలల్లో నమోదు ప్రక్రియను కొనసాగించాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే అనాథ పిల్లలకూ విద్యాకానుక కిట్ అందించాలని తెలిపింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలపై నెలవారీ నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.