
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ఆదివాసీ ప్రాంతాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాల్లో బాల్య వివాహాలు, మైనర్ బాలికలు గర్భం దాల్చుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండేండ్ల ఈ జిల్లాల్లో వందలాది బాల్య వివాహాలు కాగా, చాలా మంది చిన్న వయసులోనే గర్భం దాల్చుతున్నారు. ఇలా బడికెళ్లే వయసులోనే తల్లులుగా మారుతున్నారు.
ఆందోళన కలిగించే గణాంకాలు
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ (ICDS) రికార్డుల ప్రకారం.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు (ASR)జిల్లాల్లో గత రెండు సంవత్సరాల్లో మొత్తం 442 బాలికలు చిన్న వయసులోనే గర్భం దాల్చారు. ఇందులో ASR జిల్లాలో 312 మంది మైనర్లు గర్భవతులు అయ్యారు. పాడేరు రెవెన్యూ డివిజన్ లోనే 228 మంది, చింతూరు డివిజన్ 47, రంపచోడవరం డివిజన్ 37 మంది మహిళలు గర్భవతులు అయ్యారు.
ఇక జీకే వీధి మండలంలో ఏకంగా 37 మంది చిన్నారులు గర్భం దాల్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు యేటా 130 మంది మైనర్ బాలికలకు చికిత్సలు, ప్రసవ సేవలను పొందుతున్నారు. ప్రస్తుతం పాడేరు ప్రాంతంలో 171 మంది మైనర్ గర్భవతులు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
బాల్య వివాహాలు.. కారణాలు
ఈ పరిస్థితిపై ICDS ప్రాజెక్ట్ డైరెక్టర్ జె. సూర్యలక్ష్మి మాట్లాడుతూ.. “వీళ్లందరూ స్కూల్ చదివే బాలికలే అని చెప్పలేం. కొందరు స్కూల్ మానేసినవారు, కొందరు నిరక్షరాస్యులు కూడా ఉండొచ్చు,” అని తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో పాఠశాలలు, కళాశాలలు, పండుగలు, వారపు మార్కెట్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 48 బాల్య వివాహాలను నివారించామని తెలిపారు. “బాల్య వివాహాలు వారి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం” అనే భావన గ్రామ పెద్దల్లో ఎక్కువగా ఉండటమే ఈ సమస్య కు ప్రధాన కారణమేదేనని పేర్కొన్నారు.
కిషోరి వికాసం
ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘కిషోరి వికాసం’అనే వేసవి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇది గ్రామస్థాయిలో తల్లిదండ్రులకు అవగాహన, బాలికలకు ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాల నివారణపై దృష్టి పెడుతుంది. ఈ సమస్యపై అరకు ఎంపీ జి. తనుజా రాణి మాట్లాడుతూ.. గిరిజన వర్గాల్లో అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. తల్లిదండ్రులు పిల్లలపై బలవంతం చేయలేదని తెలిపారు.
విద్యా లోపమే మౌలిక కారణం
ASR జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ టీనేజ్ ముద్దుల తల్లులను మళ్లీ పాఠశాలలకు చేర్చడానికి ప్రోత్సాహాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం సగటున 16-18 బాల్య వివాహాలను అడ్డుకుంటున్నామనీ, 130 పైగా మైనర్లు గర్భం దాల్చిన కేసులు నమోదవుతున్నాయి. జిల్లా ఆసుపత్రిలో నెలకు సగటున ఆరుగురు మైనర్ బాలికలు ప్రసవిస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి.