టికెట్ దక్కలేదని అలక.. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ

By ramya NFirst Published Mar 16, 2019, 2:44 PM IST
Highlights

మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. 

మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. కాగా.. ఈ జాబితాలో టికెట్లు దక్కనివారంతా.. పార్టీకి రాజీనామాలు చేసే పనిలో పడ్డారు. అయితే.. వారిని బుజ్జగించే పని కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లకూరు శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చివరినిమిషం వరకు తనకు టికెట్ దక్కుతుందని పెళ్లకూరు ఎదురుచూశారు. అయితే.. దక్కదని తేలడంతో రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు లేఖను రాష్ట్ర పార్టీ ఆఫీసుకు పంపారు. దీనిపై స్పందించిన రాష్ట్ర పార్టీ ప్రత్యేక దూత ద్వారా గురువారం రాత్రి పెళ్లకూరును అమరావతికి పిలిపించుకున్నారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రల సమక్షంలో అరగంటకు పైగా పెళ్లకూరుతో మాట్లాడారు.
 
‘శ్రీనివాసులు రెడ్డి నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు, ఎమ్మెల్సీ పదవి ఇస్తాను, వరసలో నీవే ముందున్నావు, ఏ పదవి అయినా నిన్ను దాటుకునే ముందుకు వెళుతుంది..’ అని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. దీంతో.. ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

click me!