ప్రజల దృష్టిని మరల్చేందుకే అమరావతి భూములపై దుష్ప్రచారం: చంద్రబాబు

By narsimha lodeFirst Published Sep 15, 2020, 5:10 PM IST
Highlights

ప్రజల దృష్టి మళ్లించేందుకే అమరావతి భూములపై  వైసీపీ ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు.  


హైదరాబాద్:  ప్రజల దృష్టి మళ్లించేందుకే అమరావతి భూములపై  వైసీపీ ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు.  ఈ విషయమై కేబినెట్ సబ్ కమిటి వేశారు, సిట్ వేశారు, సిబిఐకి ఇచ్చారు, రాజకీయ కక్షతోనే టిడిపి నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

మంగళవారం నాడు టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజల ప్రాణాలంటే వైసిపికి లెక్కలేకుండా పోయిందన్నారు. ప్రజల ఆరోగ్యం అంటే లెక్కలేదు, పేదల ఉపాధిపై లెక్కలేదు, ఆడబిడ్డల మానానికి, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.రాష్ట్రంలో స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేదు, మాట్లాడే హక్కు లేదు. ఉన్మాదుల భజన చేయకపోతే ఉసురు తీస్తున్నారన్నారు.

వైసిపి పాలనలో ప్రాథమిక హక్కులనే కాదు, జీవించే హక్కును కూడా కాలరాస్తున్నారు. ఏడాదిన్నరలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశారని ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకమైనది. అభివృద్ది చేయాల్సిన బాధ్యత అధికార పార్టీదైతే, అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే. అలాంటిది ప్రతిపక్షాన్ని అణిచేయాలని పోలీసులు చూడరాదని ఆయన చెప్పారు.  ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ప్రయత్నించొద్దన్నారు.

 పోలీసులపై ఇన్ని అభియోగాలు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు తన జీవితంలో వినలేదు, చూడలేదన్నారు. పార్టీలకు అతీతంగా బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ కొందరికే కొమ్ము కాస్తోందనే భావన ప్రజల్లో పెరగడం దుష్పరిణామంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో దళితులపై వైసిపి హింసాకాండ కొనసాగుతూనే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నలుగురు దళిత యువకులను కొట్టుకుంటూ లాక్కెళ్లడం, 36గంటల అక్రమ నిర్బంధం అతి దారుణమని చెప్పారు.

హిందూ ధార్మిక సంస్థలపై, దేవాలయాలపై అరాచకశక్తుల దాడులను అందరూ గర్హించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ మతం విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. టిడిపి మత సామరస్యానికి కట్టుబడిన పార్టీ. ఏ మతం విశ్వాసాలను దెబ్బతీసినా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ప్రథమ వర్థంతి బుధవారం అన్ని జిల్లాలలోనిర్వహించాలని ఆయన ఆదేశించారు. వైసిపి ప్రభుత్వ దుర్మార్గాలకు కోడెల శివ ప్రసాద్ బలి అయ్యారు. తప్పుడు ఆరోపణలతో కోడెల కుటుంబ సభ్యులపై 23కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి ఆయన ఉసురు తీశారని ఆయన ఆరోపించారు.

ఏడాదిన్నరలో వేల కోట్ల భారాలు ప్రజలపై మోపారు.  సిఎన్ జిపై 10% పన్ను పెంచి ఆటో డ్రైవర్లపై భారం మోపారు. ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారని ఆయన మండిపడ్డారు.

click me!