
కుప్పం : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కారు డ్రైవర్ నాగరాజు పై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన నాగరాజును స్థానికులు కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆర్అండ్బి అతిథి గృహం వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని బాధితుడు చెప్పారు.
ఇదిలా ఉండగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ వైసీపీ నేత లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే ఈ పిటిషన్ ను కొట్టివేసిందని తెలిపింది. ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాలని కోర్టు ప్రశ్నించింది. లక్ష్మీ పార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
అమరావతి రైతుల మహా పాదయాత్ర ఉత్తరాంధ్రపై దండయాత్ర: ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్
కాగా, గతనెల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి తను చనిపోయే ముందు లేఖ రాసిందని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఆగస్ట్ మూడున ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ ప్రదేశానికి చంద్రబాబు నాయుడు వెళ్లాక ఆ లేఖ మాయమైందని ఆమె ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబానికి శనిలాంటి వాడని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి మృతి మిస్టరీగా మారిందన్నారు.
ఉమా మహేశ్వరి మృతి వెనుక ఏదో జరిగి ఉంటుందనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆగస్ట్ 1వ తేదీన ఉమామహేశ్వరి హైద్రాబాద్ లోని తన సొంత నివాసంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తెల్లారి మధ్యాహ్నం ఉమా మహేశ్వరి అంత్యక్రియలు జరిగాయి. ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఆమె కూతురు, అల్లుడు కూడా ఉన్నారు. కూతురు దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీక్షిత ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు.