పోలవరం వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు: రోడ్డుపై బైఠాయించి టీడీపీ చీఫ్ నిరసన

By narsimha lode  |  First Published Dec 1, 2022, 6:15 PM IST

పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు  చంద్రబాబును వెళ్లకుండా  పోలీసులు గురువారంనాడు అడ్డుకొన్నారు. దీంతో  చంద్రబాబునాయుడు రోడ్డుపై బైఠాయించి  నిరసనకు దిగారు. 


ఏలూరు: ఉమ్మడి  పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం వద్ద గురువారంనాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడిని పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో  చంద్రబాబు వాగ్వాదానికి దిగారు.  అంతేకాదు  రోడ్డుపై బైఠాయించి  చంద్రబాబు ధర్నాకు దిగారు.రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రివర్స్ టెండరింగ్  పేరుతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ఏ కారణంతో  పోలీసులు తనను అడ్డుకున్నారో  చెప్పాలన్నారు. పోలవరంలోనే  ఏడు మండలాలను కలిపితేనే తాను సీఎంగా ప్రమాణం చేస్తానని  చెప్పడంతో  ఆనాడు ఎన్డీఏ సర్కార్ ఏడు మండలాలను  ఏపీలో  కలిపిందన్నారు. 

  పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లకూడదో   తనకు  రాసివ్వాలని చంద్రబాబు  పోలీసులను కోరారు. తాను చేపట్టిన ప్రాజెక్టు సందర్శనకు తనకే అనుమతి ఇవ్వడం లేదన్నారు. వైసీపీ నేతల కక్కుర్తికి ప్రాజెక్టును బలిపశువును చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు  పూర్తి  కాకపోవడంతో  ఐదు కోట్ల  ప్రజలకు తీరని  ద్రోహం జరిగిందని చంద్రబాబు చెప్పారు.పోలవరం ప్రాజెక్టు నాశనమైన తీరు ప్రజానీకానికి తెలియాల్సి ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.పోలవరం ప్రాజెక్టు విషయంలో చీకటి జీవోలతో వైసీపీ సర్కార్ ప్రజలను మభ్యపెడుతుందని చంద్రబాబు విమర్శించారు.. తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు  ఎదురుదాడులకు దిగుతున్నారని చంద్రబాబు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం  చేశారు. తనకు నక్సలైట్ల ముప్పుందని  పోలీసులు చెబుతున్నారన్నారు. పోలవరం సందర్శనకు వీల్లేదని  పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తే అనుమతించాలని  చంద్రబాబు పోలీసులను కోరారు.  అయినా  కూడా  తనకు అనుమతివ్వలేదన్నారు. గతంలో  తాను పోలవరం ప్రాజెక్టును 27 సార్లు సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడు లేని నక్సలైట్ల సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందో  చెప్పాలన్నారు.

Latest Videos

click me!