చంద్రబాబు సర్వే: 30 నుంచి 40 ఎమ్మెల్యేలకు నో టికెట్స్

By pratap reddyFirst Published Aug 22, 2018, 11:40 AM IST
Highlights

వచ్చే శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు సాగిస్తున్నారు. రాష్ట్రంలోని పార్టీ శాసనసభ్యుల పనితీరుపై ఆయన సర్వే చేయించారు.

అమరావతి: వచ్చే శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు సాగిస్తున్నారు. రాష్ట్రంలోని పార్టీ శాసనసభ్యుల పనితీరుపై ఆయన సర్వే చేయించారు. 30 నుంచి 40 మంది సిట్టింగ్ శాసనసభ్యులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు నిరాకరించే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుత శాసనసభ్యులను 30 నుంచి 40 స్థానాల్లో మార్చి, ఇతరులకు టికెట్లు ఇవ్వడం ద్వారా మాత్రమే గెలుపు బాట పట్టగలమనే అంచనాకు ఆయన వచ్చినట్లు చెబుతున్నారు. వారికి ఏదో విధంగా నచ్చజెప్పి పోటీ నుంచి తప్పించాలనే ప్రయత్నం చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

చంద్రబాబును మరో సమస్య కూడా చుట్టుముట్టుడుతోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వచ్చిన శాసనసభ్యులకు, ముఖ్య నాయకులకు వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించడం కూడా తలనొప్పిగానే మారవచ్చు. మొదటి నుంచీ పార్టీలో ఉన్నవారికి, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మధ్య చాలా చోట్ల పొసగడం లేదు. 

అటువంటి స్థానాల్లో ఇరు పక్షాల మధ్య రాజీ కుదిర్చడానికి పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదర్చడానికి అవసరమైన ఫార్ములాను తయారు చేయనున్నట్లు చెబుతున్నారు. 

చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం చంద్రబాబుకు భవిష్యత్తు కార్యాచరణకు దారి చూపిందని అంటున్నారు. మదనపల్లి నియోజకవర్గంలో ముగ్గురు నాయకులు టికెట్లు ఆశిస్తున్నారు. అయితే, వారు ముగ్గురు తమంత తాము రాజీకి వచ్చి ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాలని, మిగతా ఇద్దరికి ఏదో విధమైన పదవులు వచ్చేలా చూసుకోవాలని, అందుకు చంద్రబాబును ఒప్పించాలని వారు నిర్ణయానికి వచ్చారు. దీంతో మదనపల్లి సమస్య దాదాపుగా పరిష్కారమైనట్లే. 

ఒకరి కన్నా ఎక్కువ మంది టికెట్లు ఆశించేవారున్న నియోజకవర్గాల్లో మదనపల్లి ఫార్ములాను అనుసరించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సాధ్యమైనంత త్వరగా 30 నుంచి 40 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన భావిస్తున్నారు. ఈ సమయంలోనే తొలి జాబితాను విడుదల చేయాలని ఆయన అనుకుంటున్నారు. 

click me!