వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. ఆంధ్రప్రదేశ్‌ను ఎవరూ కాపాడలేరు: చంద్రబాబు

By Sumanth KanukulaFirst Published Nov 19, 2022, 4:01 PM IST
Highlights

వైసీపీ సర్కార్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఇంతటి నీచమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.

వైసీపీ సర్కార్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఇంతటి నీచమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ రూపొందించి ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాళ్లేస్తే భయపడే పార్టీ టీడీపీ కాదని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దాడులు జరిగాయని.. ఇవన్నీ పోలీసుల సహకారంతో ప్రభుత్వమే చేసిందని ఆరోపించారు. 

అధికార పార్టీకి చెందిన ఓ ఫ్లెక్సీ తగలగడితే పోలీసులు డాగ్స్‌ను రంగంలోకి దించారని.. తునిలో టీడీపీ నేత మీద హత్యాయత్నం జరిగితే పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తనపై పూలు వేస్తే.. అందులో రాళ్లున్నాయని పోలీసులు చెబుతున్నారని అన్నారు. రేపు అవే పూలల్లో బాంబు ఉందని అంటారా? అని పోలీసులపై మండిపడ్డారు. తన మీద రాళ్లేస్తే  తాను భయపడి పర్యటనలు చేయకూడదని ప్రభుత్వ ఉద్దేశం అని విమర్శించారు. 

అచ్చెన్నాయుడును వేధించడంతో ప్రభుత్వం దారుణాలకు తెర లేపిందని అన్నారు. ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీస్ కస్టడీలో ఉండగానే చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోర్టులు తప్పు పట్టినా ప్రభుత్వం భయపడ లేదని అన్నారు. ఇవాళే కాదు.. రేపు కూడా ఉంటుందని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలతో గెలిచిన అధికార పార్టీ నేతలకు కొవ్వెక్కిందని విమర్శించారు. ప్రతి సందర్భంలోనూ ప్రజలను.. ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

కర్నూలు జిల్లాలో తన పర్యటనకు పెద్ద ఎత్తున ప్రజాదరణ లభించిందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాకుంటే తమను ఎవ్వరూ కాపాడలేరని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఆదోని, ఎమ్మిగనూరు ప్రజలు ఒకే రాజధాని కావాలని ముక్త కంఠంతో నినదించారని చెప్పారు. ఇప్పుడు మూడు రాజధానులు అని అంటున్న జగన్.. అప్పుడు అమరావతి రాజధానిగా ఉండేందుకు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే వైఎస్ జగన్ తరహాలోనే దోచుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడితే.. రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరని అన్నారు. టీడీపీ గెలుపు తన కోసమో.. పార్టీ నేతల కోసమో కాదని.. రాష్ట్రాభివృద్ధి కోసమేనని అన్నారు. 

click me!