ఫుల్లుగా క్లాస్ పీకిన చంద్రబాబు

First Published Jan 23, 2018, 6:35 AM IST
Highlights
  • టిడిపి వర్క్ షాపులో చంద్రబాబునాయుడు నేతలకు ఫుల్లుగా క్లాసు పీకారు.

టిడిపి వర్క్ షాపులో చంద్రబాబునాయుడు నేతలకు ఫుల్లుగా క్లాసు పీకారు. పార్టీ ప్రతిష్ట పెంచటానికి తాను నానా అవస్తలు పడుతుంటే కొందరు నేతలు మాత్రం పార్టీ ప్రతిష్ట మంటకలిసేట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇంతకీ చంద్రబాబుకు అంత కోపం ఎందుకు వచ్చింది? ఎందుకంటే, కోడిపందేల గురించి మాట్లాడుతూ నేతలకు ఫుల్లుగా క్లాసు పీకారట.

కోడి పందేల్లో పలుచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు చురుకైన పాత్ర పోషించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాటితో మీకేం సంబంధం? అది మీ పనా? పార్టీ ప్రతిష్ఠను ఏం చేద్దామనుకుంటున్నారు?’  అంటూ ప్రభుత్వం-పార్టీ సమన్వయ సమావేశంలో మండిపడ్డారట.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘గతంలో ఎక్కడో తోటల్లో, పాకల్లో కోడి పందేలు జరిగేవి. ఇప్పుడు ప్రతిచోటా జాతర మాదిరి తయారు చేసేశారు’ అంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు దగ్గరుండి ఆడించారు. పైగా టీవీల ముందుకొచ్చి తామే నిర్వహిస్తున్నట్లు ఘనంగా ప్రకటనలు చేయటాన్ని ప్రస్తావించారు.  ఆ పందేలు ఏమిటి? వాటి దగ్గర బల్లలేమిటి అంటూ నిలదీశారు.

చివరకు కోడిపందేల నిర్వహణ సంప్రదాయం లేని జిల్లాలకు కూడా పాకించేశారంటూ తలంటిపోశారు. ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ఠ ఏం కావాలి?  ప్రభుత్వమే వీటిని ఆడిస్తోందన్నచెడ్డపేరు తేవాలనుకుంటున్నారా? అంటూ ప్రజాప్రతినిధులను నిలదీసారు. నాలుగేళ్ల నుంచి పసిబిడ్డను కాపాడుకుంటున్నట్లు(పార్టీని) రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ప్రజల్లో ప్రతిష్ఠ తెచ్చుకోగలిగామన్నారు.

మచ్చ పడకుండా పనిచేస్తున్నాం. జన్మభూమిలో ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదన్నారు. నిజానికి జన్మభూమి కార్యక్రమంలో గొడవలు జరగని ప్రాంతాలు చాలా తక్కువ. జన్మభూమి నిర్వహణ ద్వారా ప్రజల్లో మంచి ఆదరణ లభించిందని చెప్పారు. ‘ఆదరణను పాడు చేద్దామని అనుకుంటున్నారా’ అని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఆగ్రహంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కిక్కురుమనలేదట.

click me!