జగన్ మనస్థత్వమే అంత... ప్రజలు ఏమనుకుంటున్నారంటే: చంద్రబాబు

Arun Kumar P   | Asianet News
Published : Sep 16, 2020, 08:03 PM IST
జగన్ మనస్థత్వమే అంత... ప్రజలు ఏమనుకుంటున్నారంటే: చంద్రబాబు

సారాంశం

ప్రజలను కాపాడాలి అనే ఆలోచన కన్నా జగన్ అహంభావం, నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా పెరిగిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. 

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ టీడీపీ పాలనపై అవినీతి ముద్ర వేసేందుకు కుట్ర పన్నుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి నేతలతో చంద్రబాబు  సమన్వయ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉండేదా? ఇన్ని కష్టాలు ఉండేవా? ఇంత అట్టడుకు రాష్ట్రం వచ్చేదా? దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లీంలపై ఈ దాడులు జరిగేవా? ఆలయాలలో ఈ అరాచకాలు ఉండేవా? ప్రజలపై ఇన్ని వేల కోట్లు భారాలు పడేవా? ప్రాజెక్టులు ఇలా అసంపూర్తిగా వదిలేసేవాళ్లమా? రోడ్లు, ఇళ్లు, నిర్మాణ పనులను మధ్యలో వదిలేసేవాళ్లమా? అని ప్రజలే చర్చించుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. 

''వైసీపీ పాలనకు, టీడీపీ పాలనకు పోల్చి మాట్లాడుతున్నారు. సీఎం జగన్ కి రాష్ట్రంపై, సమస్యలపై అవగాహన లేదు, కేవలం అహంకారం ఉంది. పనిచేయడం చేతకాదు, చేసేవాళ్లను చేయనివ్వడు. అతనికి ఏమీ తెలియదు, తెలిసిన వాళ్లను చెప్పనివ్వడు. తన అవినీతి బురద ఇతరులకు అంటించాలని ఆరాటపడతాడు'' అని మండిపడ్డారు. 

''ప్రజలను కాపాడాలి అనే ఆలోచన కన్నా జగన్ అహంభావం, నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా పెరిగిపోయింది. స్థానిక ఆసుపత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇన్ ఫ్రాస్ర్టక్చర్ నిర్వీర్యం చేశారు. అందుకే చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైసీపీ మంత్రులు, ఎంపీలే వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లారంటే మన రాష్ట్రంలో ఆసుపత్రులను ఎంత నిర్లక్ష్యం చేశారో అద్దం పడుతోంది. రోగులకు బెడ్స్ లేక, క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు లేక పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు'' అని అన్నారు. 

read more  చంద్రబాబుది జైలు జీవితమే...: మరోసారి విరుచుకుపడ్డ మంత్రి కొడాలి (వీడియో)

''ప్రతిపక్షంలో ఉంటూ బాధ్యతగా తెలుగుదేశం పార్టీ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ తో వెబినార్ పెట్టి మానసిక వైద్య నిపుణులతో, ఇతర స్పెషలిస్ట్ వైద్యులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తే అధికార పార్టీ వైసీపీకి ఆ మాత్రం బాధ్యత కూడా లేకపోవడం బాధాకరం'' అన్నారు. 

''మతాల మధ్య చిచ్చు పెడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. టీడీపీ మత సామరస్యాన్ని కాపాడేందుకు అత్యధిక అవకాశం కల్పిస్తే.. నేడు ప్రత్యేకంగా దేవాలయాలపై దాడులు, ధ్వంసాలు జరుగుతున్నాయి. నాడు హైదరాబాద్ లో మత ఛాందస వాదులతో, నక్సలైట్లతో, తీవ్రవాదులతో, ఫ్యాక్షనిస్టులతో పోరాడాం. కానీ నేడు పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ప్రజల ఆస్తుల్ని దోచుకోవడానికి ప్లాన్ చేశారు'' అని ఆరోపించారు. 

''తిరుమలకు పోయే బస్సు టికెట్లపై జెరూసలెం గురించి పబ్లిసిటీ చేశారు. అన్యమత ప్రచారం చేశారు. అంతర్వేధిలో రధం దగ్ధం చేశారు. శ్రీశైలంలో అన్యమతస్తులకు షాపులు కేటాయించారు. అన్యమత ప్రచారం అడ్డుకున్న ఈవోను కొట్టారు. సింహాచలం దేవస్థానం భూముల్ని కబ్జా చేసేందుకు ట్రస్టీని కూడా మార్చేశారు. మతం అనేది నమ్మకం. మనోభావాలకు సంబంధించిన విషయం అని మరిచి.. మతాల మధ్య చిచ్చు పెడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. రాష్ట్రంలో ఇంత స్థాయిలో దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా ఏనాడూ ముఖ్యమంత్రి బయటకొచ్చి పత్రికా సమావేశం పెట్టకపోవడం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు. 

''అవినీతిలో నిండా మునిగిన వైసీపీ ఆ బురదను టీడీపీపై చల్లడం హేయం. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ టీడీపీ ప్రభుత్వ పాలనపై అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారు. వైసీపీ 16 నెలల పాలనలో చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేశారు. ఇసుక, మైనింగ్, మట్టి, మద్యంపై దోచుకుంటున్నారు. గత 16 నెలల్లో జరిగినంత దోపిడీ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ జరిగి ఉండదు. ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టాలంటేనే భయపడుతున్నారు. ప్రశ్నించే టీడీపీ నేతల్ని అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు. నిలదీసిన వారిపై దాడులకు దిగుతున్నారు'' అంటూ వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. 


 

PREV
click me!

Recommended Stories

Anam Rama Narayana Reddy:థ్యాంక్ యూ సార్.. పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆనం ప్రశంసలు| Asianet News Telugu
Atchennaidu Appreciated Pawan Kalyan: ఇవి మినీ కలెక్టరేట్లలా పనిచేస్తాయి | Asianet News Telugu