
అమరావతి: తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆలోచనపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు జగనన్న వదిలిన బాణం ఇప్పుడేమైందని ఆయన అడిగారు. ఇంట్లోవాళ్లకే జగన్ వెన్నుపోటు పొడిచారని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్ ఇప్పుడు షర్మిల విషయంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ పెడుతున్నామని షర్మిల చెబుతుంటే ఏ2 మాత్రం లేదంటారా అని అడిగారు.
ఇదిలావుంటే, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కూడా చంద్రబాబు స్పందించారు. తాజాగా వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని ఆయన అన్నారు. వైసీపీ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. 20 నెలల జగన్ పాలనలో అన్నీ ఉల్లంఘనలేనని ఆయన అన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ దెబ్బ తీసే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారంనాడు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు అమరావతి, పోలవరం, పెట్డుబడులను ధ్వంసం చేశారని ఆయన విమర్శించారు. విద్వేషాలతో, హింసతో రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు ఎన్నికల్లో పెద్ద యెత్తన హింసాకాండ, మద్యం, డబ్బుల పంపిణీ జరిగిందని ఆయన అన్నారు.
తమ పార్టీ ప్రజల గుండెల్లో ఉందని అన్నారు. ఎన్ని దుర్మార్గాలుచేసినా ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. ఎంత హింస పెట్టినా ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాటం చేశారని అన్నారు. 38.74 శాంత ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వచ్చినట్లు ఆయన తెలిపారు. 94 శాతం వైసీపీ గెలుచుకుందని గాలి కబుర్లు చెబుతున్నారని ఆయన అన్నారు.
తమ పార్టీ నేత అచ్చెన్నాయుడిపై కక్ష సాధింపు చర్యలకు దిగి ఆయనపై కేసు పెట్టారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతలు మాట్లాడితే పట్టించుకోరని ఆయన అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు రాష్ట్రవ్యాప్తంగా 174 అక్రమ కేసులు బనాయించారని ఆయన చెప్పారు