చంపేస్తారా, డీజీపీ సమాధానం చెప్పాలి: మాచర్ల ఘటనపై బాబు ఆగ్రహం

By narsimha lodeFirst Published Mar 11, 2020, 1:44 PM IST
Highlights

రాష్ట్రంలొని అన్ని ప్రాంతాల్లో తమ పార్టీకి చెందిన నేతలపై వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  చెప్పారు

మాచర్ల: రాష్ట్రంలొని అన్ని ప్రాంతాల్లో తమ పార్టీకి చెందిన నేతలపై వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  చెప్పారు.  మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమ,  బుద్దా వెంకన్న ప్రయాణీస్తున్న కారుపై  దాడికి దిగడంపై  బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడిలో ఆ ఇద్దరు నేతల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులని  ఆయన ప్రశ్నించారు. 

Also read:మాచర్లలో బొండా, బుద్దా వెంకన్న కారుపై వైసీపీ దాడి: ఉద్రిక్తత

బుధవారం నాడు మధ్యాహ్నం టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  తమ పార్టీ కార్యకర్తలపైనే కాదు పోలీసులపై కూడ దాడులకు దిగారని బాబు చెప్పారు. ఈ దాడులపై డీజీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందా అని ఆయన ప్రశ్నించారు. రౌడీల, గుండాలను పెంచి పోషిస్తారా అన్నారు.తమ పార్టీకి చెందిన నేతలను చంపుతారా అని బాబు ఆవేశంగా ప్రశ్నించారు

అదృష్టవశాత్తు బొండా ఉమ, బుద్దా వెంకన్నలు ప్రాణాలతో బయటపడ్డారన్నారు. పులివెందుల పంచాయితీ చేస్తారని తాను చెప్పిన మాటలకు మాచర్లలో దాడే నిదర్శనమేనని చెప్పారు.  బుధవారం నాడు ఉదయమే గుంటూరు ఎస్పీతో తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఈ దాడిని చూసైనా నిర్ణయం తీసుకోవాలని  చంద్రబాబు ప్రజలను కోరారు.  ఈ ఘటనపై డీజీపీతో పాటు సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీకి చెందిన నేతలకు రక్షణగా వచ్చిన పోలీస్ వాహనంపై కూడ వైసీపీ దాడికి దిగిందని చంద్రబాబునాయుడు చెప్పారు. 

తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్నాయన్నారు. 

 మీడియా సమావేశంలోనే చంద్రబాబునాయుడు ఫోన్లో నేరుగా బొండా ఉమ మహేశ్వరరావు, బుద్దా వెంకన్నతో చంద్రబాబునాయుడు మాట్లాడారు. దాడి ఎలా జరిగిందో ఆ ఇద్దరు  నేతల నుండి చంద్రబాబునాయుడు  వివరాలు అడిగి తెలుసుకొన్నారు.  

మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు  సహాయం చేసేందుకు వెళ్లిన అడ్వకేట్  కారుపై కూడ దాడికి దిగారు. ఈ విషయమై ఆయనతో కూడ చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. అడ్వకేట్  ప్రాణ భయంతో  కారులో నల్గొండ జిల్లాలోకి ప్రవేశించినట్టుగా   చంద్రబాబునాయుడు చెప్పారు. 

 పోలీస్ స్టేషన్‌కు వెళ్లి  తనకు ఫోన్‌ చేయాలని  టీడీపీకి చెందిన అడ్వకేట్ కు చంద్రబాబునాయుడు సూచించారు.ప్రాణాలను రక్షించుకొనేందుకు  ఏపీ నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.
 

click me!