2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ తమ్మినేనిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కోరారు.
రాజ్యసభ ఎన్నికల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను వేడెక్కిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదముద్ర వేయడంతో అగ్గిరాజుకుంది. రెండేళ్లుగా సైలెంట్‌గా వుండి సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందు రాజీనామాను ఆమోదించడం ఏంటంటూ వైసీపీపై టీడీపీ భగ్గుమంది. అలాగే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్‌ను కోరింది.
ఈ నేపథ్యంలో వైసీపీకి కౌంటర్‌గా టీడీపీ పావులు కదుపుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ తమ్మినేనిని ఆ పార్టీ కోరింది. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా సభాపతిని కోరారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి ఇప్పటికే పిటిషన్ వేశారు. డోలా అనర్హత పిటిషన్‌పై స్పీకర్.. చంద్రబాబు అభిప్రాయం కోరగా, టీడీపీ చీఫ్ తన అభిప్రాయాన్ని చెప్పారు.