టీడీపీ సీనియర్ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇకపై రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించనున్నట్లుగా మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలని గల్లా భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
టీడీపీ సీనియర్ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇకపై రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించనున్నట్లుగా మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలని గల్లా భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి వరుసగా ఎంపీగా గెలిచిన జయ్‌దేవ్ సెకండ్ టర్మ్ తొలినాళ్లలో కొంత యాక్టీవ్‌గానే వ్యవహరించారు. ఎప్పుడైతే జగన్ సర్కార్ గల్లా కుటుంబానికి చెందిన అమరరాజాపై గురి పెట్టిందో జయ్‌దేవ్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. అంతేకాదు.. తన వ్యాపారాలను తెలంగాణ, తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
అటు జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి కూడా పార్టీకి దూరంగానే వుంటున్నారు. ఇప్పటికే పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేశారు. అటు జయదేవ్ కూడా పూర్తిగా తన వ్యాపారాలకే పరిమితం కావడంతో చంద్రబాబు సైతం గుంటూరు ఎంపీ స్థానానికి కొత్త నేతను ఎంపిక చేసే పనిలో వున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఒకానొకదశలో జయదేవ్ వైసీపీలో చేరుతారంటూ ప్రచారం కూడా జరిగింది. సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో గల్లా టచ్‌లోకి వెళ్లినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. వాస్తవానికి గల్లా కుటుంబానిది చంద్రగిరి నియోజకవర్గమే.
ఈసారి మాత్రం ఏకంగా గల్లా జయదేవ్ రాజకీయాలకే స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో వున్నందువల్ల తమ వ్యాపారాలకు ఇబ్బందులు వస్తున్నాయని, అధికార యంత్రాంగం సహకరించడం లేదని జయదేవ్ అసంతృప్తితో వున్నారు. ఈ నెల 28న తన రాజకీయ జీవితానికి ముగింపు పలకాలా.. లేదంటే కొనసాగాలా అన్న దానిపై మహేశ్ బావ క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ రోజున టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ కావాలని గల్లా నిర్ణయించుకున్నారు. ఓ ఫంక్షన్ హాల్‌లో టీడీపీ నేతలు, కేడర్‌కు విందును కూడా ఇవ్వనున్నారు. మరి గల్లా జయదేవ్ నిర్ణయమేంటో తెలియాలంటే జనవరి 28 వరకు వెయిట్ చేయాల్సిందే.