టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు అర్ధరాత్రి బెయిల్.. నేడు ఆయన ఇంటికెళ్లనున్న చంద్రబాబు

Published : Feb 12, 2022, 10:23 AM IST
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు అర్ధరాత్రి బెయిల్.. నేడు ఆయన ఇంటికెళ్లనున్న చంద్రబాబు

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శనివారం ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు (Ashok Babu) ఇంటికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పడమట లంకలోని అశోక్‌బాబు నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శనివారం ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు (Ashok Babu) ఇంటికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పడమట లంకలోని అశోక్‌బాబు నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. గురువారం రాత్రి అశోక్‌బాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయగా.. శుక్రవారం అర్ధరాత్రి ఆయనకు బెయిల్ లభించింది. దీంతో ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన విడుదలయ్యారు. ఈ క్రమంలోనే నేడు చంద్రబాబు అశోక్ బాబు ఇంటికి వెళ్లి.. ఆయనను పరామర్శించనున్నారు. అశోక్ బాబు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పడమట లంకలోని అశోక్‌బాబు నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. 

ప్రభుత్వ సర్వీసు రికార్డులో విద్యార్హతను ట్యాంపర్‌ చేశారనే ఆరోపణలతో అశోక్‌బాబును గురువారం రాత్రి ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయనను గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. అక్కడే చాలా గంటలపాటు అశోక్‌‌బాబును ప్రశ్నించారు. అయితే అశోక్‌బాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని కూడా సీఐడీని  హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు లోకాయుక్తను కూడా ఈ కేసులో పార్టీగా చేర్చాలని కూడా హైకోర్టు కోరింది.

ఇదిలా ఉంటే.. అశోక్‌బాబును శుక్రవారం రాత్రి విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. టీడీపీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో న్యాయమూర్తి నివాసం వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అశోక్‌బాబుపై నమోదు చేసిన కేసులో పేర్కొన్న సెక్షనన్నీ బెయిల్‌కు అర్హమైనవేనని ఆయన తరపున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.. బెయిల్‌ మంజూరు చేయకుండా రిమాండ్‌ విధించాలని సీఐడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చైతన్య కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అశోక్‌బాబుకు బెయిల్ మంజూర్ చేశారు. రూ.40 వేలు, ఇద్దరి పూచీకత్తులతో ఈ బెయిల్‌ మంజూరు చేశారు.

అశోక్‌బాబు అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు..
ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్ట్ పై చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.  జగన్ సర్కార్ ఉద్యోగులకు ఏం చేసిందో చెప్పాలని .. ఈ విషయమై చర్చలకు రావాలని ఆశోక్ బాబు సవాల్ విసరడంతో ఆయనపై తప్పుడు కేసు బనాయించారని చంద్రబాబు అన్నారు. విజయవాడకు చెందిన మెహర్ కుమార్ తో తప్పుడు ఫిర్యాదు చేయించారన్నారు. క్విడ్‌కో ప్రో లో భాగంగానే మెహర్ తో తప్పుడు ఫిర్యాదు చేయించారన్నారు. మెహర్ కుమార్ భార్యకు బ్రహ్మణ కార్పోరేషన్ లో నామినేటేడ్ పదవి ఇచ్చారన్నారు. టైపింగ్ పొరపాటు వల్ల జరిగిన అంశంపై ఇంత కక్ష సాధింపు చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

ఇక, అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ACTOగా పని చేసి రిటైర్‌ అయ్యారు. అయితే Degree చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి.  దీనిపై ఉమ్మడి రాష్ట్రంలోనే శాఖాపరమైన విచారణ జరిగింది.  తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్‌బాబు అప్పట్లో వివరణ ఇచ్చారు.దీనిపై విజిలెన్స్‌ అధికారులు కూడా విచారణ జరిపి. ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు.  అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే ఈ కేసు ను మూసివేశారు.


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
చిన్నప్పుడు రాయల్ బైక్ ఎక్కేవాణ్ణి.. చంద్రబాబు పంచ్ లు | Chandrababu Review Meeting | Asianet Telugu