బాబ్లీ కేసుపై రేపే విచారణ : తెలంగాణ నేతలిద్దరు స్వయంగా హాజరయ్యే అవకాశం

By Arun Kumar PFirst Published 20, Sep 2018, 8:35 PM IST
Highlights

బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసులో ధర్మాబాద్ కోర్టు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తదుపరి విచారణకు చంద్రబాబుతో పాటు కేసు నమోదైన 15 మంది కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించింది. అయితే ఈ కేసు విచారణ మరోసారి రేపు కోర్టు ముందుకు రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంట నెలకొంది. 
 
అయితే రేపటి విచారణకు చంద్రబాబు హాజరయ్యే పరిస్థితులు కనబడటం లేదు. ఆయన తరపున ధర్మాబాద్ కోర్టులో లాయర్ల బృందం హాజరై రీకాల్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. చంద్రబాబుతో పాటు వారెంట్లు అందుకున్న మిగిలిన ఏపీ నేతల తరపున రీకాల్ పిటిషన్ వేయనున్నారు. న్యాయ నిపుణులతో, మంత్రులతో చర్చించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ అడ్వకేట్ సుబ్బారావు నేతృత్వంలోని 15 మంది లాయర్ల బృందం ఇప్పటికే ధర్మాబాద్ కు బయలేదేరినట్లు సమాచారం. 

అయితే తెలంగాణ కు చెందిన ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్ లు రేపు ధర్మాబాద్ కోర్టులో స్వయంగా హాజరయ్యే అవకాశం ఉంది. వారు తమ లాయర్లతో కలిసి కోర్టుకు  హాజరవనున్నారు. 

8 ఏళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టు మట్టడి సందర్భంగా తెలుగు దేశం నేతలపై మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే విచారణకు వీరు హాజరవడం లేదంటూ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 

ఈ కేసులో ఎఫ్ఐఆర్, చార్జ్‌షీట్, నాన్‌బెయిలబుల్ వారెంట్ కాపీలు మరాఠి భాషలో వున్నందున మరికాస్త సమయం ఇవ్వాలని లాయర్లు కోర్టును కోరనున్నారు. ఎటువంటి నోటీసులు, వారెంట్లు అందలేవని చెప్పి విచారణ వాయిదా వేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. 
 
Last Updated 20, Sep 2018, 8:35 PM IST