Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చివరి ప్రయత్నంగా నేడు న్యూఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళ్లి బీజేపీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కాగా, బీజేపీ మాత్రం ఇంకా పిలుపునివ్వలేదు.
Chandrababu: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు శరణవేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందో .. ఏ పార్టీ నేత ఎవరి చెంతకు వెళ్లనున్నారో అర్థం కాని పరిస్థితి తల్లెత్తింది. ఇప్పటికే టీడీపీ-జనసేన (TDP-Janasena)లు ఓ కూటమిగా ఏర్పడి.. 2024 ఎన్నికల్లో బరిలో దిగాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. వీరి మధ్య సీట్ల పంపకాలపై కూడా ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి రానున్నాయి. ఈ తరుణంలో బీజేపీ కూడా కూటమిలో చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ వచ్చి పొత్తులపై చర్చించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం రాత్రి హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. అవసరమైతే బాబు తర్వాత పవన్ కల్యాణ్ కూడా వెళ్లనున్నారు. ఇరువురితో మంగళవారం ఉదయం పొత్తు విషయంపై కేంద్ర పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీతో టీడీపీ పొత్తుపై రేపు ప్రాధమికంగా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీలు బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. టీడీపీ, జనసేన క్యాడర్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వేదికగా ఏం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటన వస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకం. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకుని కలిసి పనిచేస్తున్నాయి. మరోవైపు తమ పార్టీ ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుందని రాష్ట్ర బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక బిజెపి నాయకత్వం పొత్తుల నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేసింది. ముగ్గురూ కూటమిగా ఏర్పడటం ఇది తొలిసారి కాదు. 2014 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో పొత్తుల వ్యవహారంపై మూడు పార్టీల అగ్రనేతలు నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్న బీజేపీ ఈ వారంలో టీడీపీతో చేతులు కలపడంపై తన వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది.