మాపై దాడికి దిగుతున్నారు, మరీ ఇంత అరాచకమా: వైసీపీపై చంద్రబాబు ధ్వజం

By Nagaraju penumalaFirst Published Jul 24, 2019, 7:33 PM IST
Highlights

 విద్యుత్ కొనుగోలు విషయంలో రాజకీయం చేయాలని చూసి దెబ్బతిన్నారంటూ ధ్వజమెత్తారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని బంగారు బాతు గుడ్డుగా  చేయాలని తాము తపన పడితే వైసీపీ ఇష్టానుసారంగా వ్యవహరించి అమరావతిని చంపేస్తుందంటూ విరుచుకుపడ్డారు. 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో వైసీపీ అరాచకం సృష్టిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ లో తమపై దాడికి వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

ప్రతిపక్షం గొంతు నొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు స్పష్టం చఏశారు. ఎన్నికల సమయం లో 45యేళ్లకే పెన్షన్ ఇస్తాం అని ప్రకటించిన జగన్  తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారని విమర్శించారు. 

జగన్ ఇచ్చిన హామీని సాక్ష్యాలతో సహా  తమ సభ్యులు చూపించారని తెలిపారు. వైసీపీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు తమ డిప్యూటీ లీడర్లను అకారణంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. తాను వచ్చాక 45ఏళ్లకే పెన్షన్ అంశంపై మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అసెంబ్లీలో స్పీకర్ న్యాయ బద్దంగా వ్యవహరించాలని సూచించారు. స్పీకర్ తమవైపు కూడా చూడటం లేదని ఇది సరికాదన్నారు. ఇలాంటి స్పీకర్ ని తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదని విమర్శించారు. 

అసెంబ్లీ, శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ లేవనెత్తే అంశాలపై అధికార పార్టీ సమాధానం చెప్పలేకపోతుందని విమర్శించారు. ఎప్పుడో జరిగిన కృష్ణా, గోదావరి పుష్కరాల అంశాలను తెరపైకి తెచ్చి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 

తాము రైతులకు రూ.10వేలు ఇస్తామని, కేంద్రం అదనంగా ఇస్తుందని చెప్పామని స్పష్టం చేశారు. కానీ వైయస్ జగన్ మాత్రం రూ.12,500ఇస్తామని చెప్పి ఇప్పుడు కేంద్రం ఆరు వేలు, రాష్ట్రం ఆరువేలు ఇస్తుందని మరో మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

 మాట తప్ప, మడమ తిప్పం అంటే ఇదేనా అంటూ జగన్ ను ప్రశ్నించారు. సున్నా వడ్డీకే రుణాలను తాము ఇస్తే దానిని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. రూ.3,500కోట్లు  ఇస్తామని చెప్పి బడ్జెట్లో కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించారని విరుచుకుపడ్డారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 60 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. ఒకే రోజు ఆరుగురు రైతులు చనిపోయారని చాలా దురదృష్టకరమన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితికి జగన్ కారణం కాదా అని ప్రశ్నించారు.  

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము కోరుతుంటే తమపైనే ఎదురుదాడికి దిగుతారా అంటూ నిలదీశారు. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారని మండిపడ్డారు. 

వరల్డ్ బ్యాంకు, ఏఐఐబీ నిధులు ఇచ్చేందుకు వెనుకడుగు వేయడానికి కారణం వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశ్వసనీయత వల్ల ఏడు వేల కోట్ల రుణం ఇచ్చిందని స్పష్టం చేశారు. తాము నిబంధనలకు అనుగుణంగా పనులు చేశామని తెలిపారు.


మరోవైపు విద్యుత్ కొనుగోలు విషయంలో రాజకీయం చేయాలని చూసి దెబ్బతిన్నారంటూ ధ్వజమెత్తారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని బంగారు బాతు గుడ్డుగా  చేయాలని తాము తపన పడితే వైసీపీ ఇష్టానుసారంగా వ్యవహరించి అమరావతిని చంపేస్తుందంటూ విరుచుకుపడ్డారు. 

మన రాజధాని అనే భావనతో రైతులు స్వచ్చంధంగా 33వేల ఎకరాల భూమిని ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాజధానిలో అన్ని వ్యవస్థులు కుదేలయ్యాయని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇతంటి అరాచక పాలన చూడలేదన్నారు.  

click me!