మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం కలిచివేసింది.. చంద్రబాబునాయుడు...

Published : Apr 16, 2022, 11:23 AM ISTUpdated : Apr 16, 2022, 11:24 AM IST
మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం కలిచివేసింది..  చంద్రబాబునాయుడు...

సారాంశం

మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటనలో చిన్నారి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

అనంతపురం : కళ్యాణ దుర్గంలో పసిపాప మృతిపై టీడీపీ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప చనిపోడానికి కారణం అయ్యారు. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి ఆసుపత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణం.

అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే చిన్నారిని అడ్డుకోవాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది? అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం చెపుతారు? చావు డప్పులో పదవీ సంబరాలు జరుపుకున్న మంత్రి... ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు ఏం సమాధానం చెబుతారు? అంటూ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. 

ముమ్మాటికీ హత్యే.. నారా లోకేష్.. 
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటన కోసం పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ తో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన హరిజన గణేష్, ఈశ్వరమ్మ దంపతుల ఏడాది చిన్నారి బలైంది. ఇది ముమ్మాటికీ మంత్రి, పోలీసులు చేసిన హత్యే. అనారోగ్యంతో చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తున్నామని ప్రాధేయపడినా,  పోలీసులు వదలకపోవడంతోనే నడిరోడ్డుపైనే కన్నుమూసింది చిన్నారి. మీ ఆర్భాటాల కోసం శిశువుల్ని చంపేయడమే శిశు సంక్షేమమా మంత్రి గారు!  చిన్నారి కొనప్రాణాలతో కొట్టుకుంటున్న కనికరించని పోలీసులపై చర్యలుతీసుకోవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. 

ముఖ్యమంత్రి, మంత్రులు బయటకు వస్తే జనం బలవ్వాల్సిందేనా.?..కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ నేతల అతి, అత్యాత్సాహానికి అడ్డులేకుండా పోయింది. కళ్యాణదుర్గంలో చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే సంబరాల్లో మునిగిన మంత్రి వైసీపీ నేతలు కనీసం దారి కూడా ఇవ్వలేదు. వైద్యం అందించడం ఆలస్యమై పండు అనే చిన్నారి మృతి చెందింది. శిశు సంక్షేమ మంత్రిగా ఉండి శిశువుల ప్రాణాలు తీస్తారా.? ఈ ఘటన చాలా బాధ కలిగించింది. కనీసం బాధితులను పరామర్శించేంత ఓపిక, సమయం కూడా మంత్రికి లేదా.? 

మొన్న పినిపే విశ్వరూప్ ర్యాలీలో రోడ్లపై నోట్ల కట్టలు వెదజల్లి, జీరో కట్లు అంటూ గంటల పాటు వాహనదారులను ఇబ్బందులు పెట్టారు.  ముఖ్యమంత్రి, మంత్రులు బయటకు వస్తే జనం బలవ్వాల్సిందేనా.? మీ సన్మానాలకు, విహారయాత్రలకు బయటకు వస్తే ప్రజల ప్రాణాలు అడ్డుపెట్టాలా.? శుక్రవారం నాడు శ్రీకాళహస్తి ఆలయానికి మంత్రి కొట్టు సత్యనారాయణ వస్తున్నారని మూడు గంటల సేపు భక్తులను క్యూలో నిలబెట్టారు. చిన్నారులు, వృద్ధులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియడం లేదా.? వాళ్ల ఆర్తనాదాలు ఎవరు ఆలకించాలి.? మనశ్శాంతి కోసం, భక్తికోసం గుడికి వస్తున్న జనాలను వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

అసలే ఎండాకాలం, దేవాలయాల్లో అంతంత మాత్రమే సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటన చూసి కూడా సిగ్గు తెచ్చుకోవడం లేదు. ముఖ్యమంత్రి బయటకు వచ్చినా గంట ముందు నుండి జనాన్ని కదలనివ్వడం లేదు. సీఎం కారు ఎక్కితే చాలు షాపులు మూసుకుని లోపలే ఉండాలని హెచ్చరించడం ఇదెక్కడి సంస్కృతి.? మంత్రులు, వైసీపీ నేతల తీరు మార్చుకోవాలి. మా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తాం.. ఇలాగే చేస్తామని అహంకారాన్ని ప్రదర్శిస్తే ప్రజల చేతిలో బడితపూజ తప్పదు అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

సమగ్ర విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలి.. కాలవ శ్రీనివాసులు 
రాష్ట్ర మంత్రి ఉషశ్రీచరణ్ స్వాగత కార్యక్రమం ఒక చిన్నారి ప్రాణాన్ని బలితీసుకోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని చాటుతోందని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కోన్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన 8నెలల చిన్నారిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతున్న సమయంలో మంత్రి ఊరేగింపు కోసం పోలీసులు రహదారిలో రాకపోకలు నిలిపివేయడం వల్ల సకాలంలో వైద్యం అందక ఆమె మరణించడం అత్యంత విషాదమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి తగిన న్యాయం చేయడానికి మంత్రి ఉషశ్రీచరన్ ప్రయత్నించకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించడంతో పాటు అన్ని విధాలా వారికి న్యాయం చేయాలని కాలవ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్