రెండు రాజవంశాలను కలిపా..: విజయనగరంలో చంద్రబాబు

By Siva KodatiFirst Published Feb 14, 2019, 2:52 PM IST
Highlights

ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

పెట్టుబడి లేని వ్యవసాయంలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించామని, అందుకు అనుగుణంగా రూ.5 కోట్లు కేటాయించామన్నారు. విజయనగరం, బొబ్బిలి సంస్థానాల మధ్య చారిత్రకంగా ఉన్న వైరాన్ని తొలగించి, ఇరు వంశాల వారిని కలిపిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు.

మహారాజా సంగీత కళాశాల ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయ్యిందని, పి.సుశీల, ఘంటశాల వంటి వారు ఇక్కడి నుంచే వచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ద్వారా పారిశ్రామిక, ఆర్ధిక, పర్యాటక అభివృద్ది జరుగుతుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేవలం 18 నెలల్లోనే ఓర్వకల్లు విమానాశ్రయాన్ని పూర్తి చేశామని, ఈ ప్రాంతం నుంచి విదేశాలకు కూరగాయలు ఎగుమతి చేస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో విమానాశ్రయాలు ఎక్కువగా ఉన్నాయని, మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు గల రాష్ట్రం మనదన్నారు.

గురజాడ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. విజయనగరంలోని 129 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటు చేస్తామని, ఉత్తరాంధ్ర జిల్లాలకు అనుకూలంగా భోగాపురంలో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో తోటపల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశానని, కానీ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దానిని గాలికొదిలేశారని, తిరిగి తానే దానిని పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. 

click me!