టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు: డీజీపీకి బాబు లేఖ

By Siva KodatiFirst Published May 6, 2020, 6:31 PM IST
Highlights

చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతల విషయంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. 

‘‘ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో వైఫల్యం చెందడం విచారకరం. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అదేపనిగా టిడిపి సానుభూతి పరులపై, ఇతర వర్గాల ప్రజలపై దాడులు చేయడం పరిపాటి అయ్యింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బాల గంగనపల్లి పంచాయితీ కొత్త నాగురుపల్లి గ్రామంలో 100మామిడి చెట్లను నరికేయడం అందుకు ఒక ఉదాహరణ.  

చిత్తూరు జిల్లా జిడి నెల్లూరు మండలం వింజం రెవిన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 951/4 లోని 83సెంట్ల భూమిలో శ్రీమతి జి ఢిల్లీరాణి,  w/o జి సుబ్రమణ్యం రెడ్డి సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వమే శ్రీమతి ఢిల్లీరాణికి సేద్యం చేసుకునేందుకు మంజూరు చేసింది.

Also Read:కేంద్రం చెప్పిందా: జగన్ కు జీవీఎల్ చురకలు, చంద్రబాబు పుణ్యమేనని...

టిడిపి సానుభూతిపరురాలు అనే అక్కసుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ యువరాజు రెడ్డి, ఎన్ వేణుగోపాల రెడ్డి, ఎన్ సుధాకర్ రెడ్డి, ఏ సురేష్, ఎన్ వెంకటేశ్వర్లు రెడ్డి, ఎన్ మోహన్ రెడ్డి, తులసి, ఎన్ కమలాకర్ రెడ్డి తదితరులు ఆమె భూమిలోకి అక్రమంగా చొరబడి, ఫెన్సింగ్ ధ్వంసం చేసి, మామిడి చెట్లను నరికేశారు.

అధికార పార్టీ నాయకుల ఇటువంటి భయానక చర్యలు రాష్ట్రంలో మున్నెన్నడూ చూడలేదు. వీరిని శిక్షించకుండా ఇలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు.

Also Read:వలస కూలీలకు రూ.500 ఇచ్చి పంపండి: అధికారులకు జగన్ ఆదేశం

పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి వైసిపి నాయకుల రాజకీయ కక్ష సాధింపు ఆగడాలను అడ్డుకోవాల్సిన తక్షణావశ్యకత ఉంది. లేనిపక్షంలో మన ప్రజాస్వామ్యం ద్వారా పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకే తూట్లు పడే ప్రమాదంవుంది.

కాబట్టి సదరు దుర్ఘటనపై విచారణ జరిపి, దానికి కారకులైన దుండగులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. ఈ దుశ్చర్యలను కఠినంగా అణిచివేయడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ’’  చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

click me!