చంద్రబాబు ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక ఇవ్వాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు సోమవారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక తమకు ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తమకు నివేదిక ఇవ్వడానికి నిరాకరించారని చంద్రబాబు లాయర్లు పేర్కొన్నారు.
చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి న రిపోర్టులు మెయిల్ లో వచ్చినట్టుగా ఏసీబీ కోర్టు జడ్జి లాయర్లకు చెప్పారు.కాపీ అందిన తర్వాత ఇస్తామని చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు.చంద్రబాబు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ విషయమై చంద్రబాబుకు జైల్లో అవసరమైన ఏర్పాట్లు కల్పించేలా ఆదేశించాలని ఏసీబీ కోర్టులో మూడు రోజుల క్రితం లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు జైల్లో ఏసీని కేటాయించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ప్రస్తుతం జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టైన తర్వాత ఇతర కేసులను తోడుతున్నారు. ఇతర కేసులకు సంబంధించి పీటీవారంట్లను కోర్టులో దాఖలు చేస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్ కు ఏసీబీ కోర్టు నాలుగు రోజుల క్రితం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కూడ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ ఎల్ పీ పై సుప్రీంలో విచారణ సాగుతుంది. ఈ రెండు పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టు విచారించనుంది.