అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు నాయుడు. ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయం..!

By Sumanth KanukulaFirst Published Jun 3, 2023, 10:42 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగా.. రాజకీయాలు ఇప్పటికే వెడేక్కాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగా.. రాజకీయాలు ఇప్పటికే వెడేక్కాయి. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రతిపక్ష నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు  నాయుడు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అమిత్ షా అపాయింట్‌మెంట్ లభించిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మోదీతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మోదీతో చంద్రబాబు భేటీపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు.. వన్ టూ వన్ కలవడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం దాదాపు ఖరారైందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే బీజేపీని కలుపుకుపోవాలని ఈ రెండు పార్టీ అధినాయత్వాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్‌.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లాలనే ప్రతిపాదనను ఆయన బీజేపీ అధిష్టానం వద్ద ఉంచినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు చంద్రబాబు కూడా బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం  కూడా ఉంది.

ఇదిలా ఉంటే, శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన హామీలను నెరవేర్చాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన జగన్.. ఆయన కేసులు ఉండటంతో కేంద్రంతో లాలూచీ పడుతున్నారని  విమర్శించారు. జగన్ వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని మండిపడ్డారు. 

click me!