Odisha Train Accident: ఏపీ సీఎం జగన్ సమీక్ష.. ఘటన స్థలానికి మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలో బృందం..!!

Published : Jun 03, 2023, 10:13 AM IST
Odisha Train Accident: ఏపీ సీఎం జగన్ సమీక్ష..  ఘటన స్థలానికి మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలో బృందం..!!

సారాంశం

ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 238 మంది మృతి చెందగా.. 600 మందికిపైగా గాయపడ్డారని రైల్వే అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒడిశాలో ప్రమాదానికి గురైన రైళ్లలో ఒకటైన షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో పలువురు ఏపీ ప్రయాణీకులు కూడా ఉండటంతో.. 
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

రైలు ప్రమాద ఘటనా స్థలానికి ఏపీ మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని పంపనున్నారు. అలాగే జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అవసరమైన పక్షంలో ఘటనాస్థలానికి పంపించడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల ఆస్పత్రులను అలర్ట్‌గా ఉంచాలని అధికారులను ఆదేశించారు. 

Also Read: Odisha Train Accident: ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ.. ఆ తర్వాతే కారణాలు తెలుస్తాయి: అశ్విని వైష్ణవ్

మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.

Also Read: ఒడిశా రైలు ప్రమాదం : 233 కు చేరిన మృతులు.. 48 రైళ్లు రద్దు, 38 రైళ్ల దారి మళ్లింపు..

ఇదిలా ఉంటే, ప్రమాదానికి గురైన షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌.. కోల్‌కత్తా నుంచి తమిళనాడుకు ప్రయాణించాల్సి ఉంది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఏలూరు, తాడేపల్లి గూడెం, తెనాలి, నెల్లూరు, ఒంగోలు స్టేషన్లలో స్టాప్‌లు ఉన్నాయి. ఈ రైలులో ఏపీలోని పలు జిల్లాలకు చెందినవారు ప్రయాణిస్తున్నారు. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు 120మంది తెలుగు వారు ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. వీరిలో రాజమండ్రిలో దిగాల్సిన వారు 24 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరితో ఎంతమంది ప్రమాదానికి గురయ్యారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. 

 

ఇక, ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని  చెప్పారు. రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి మనస్థైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా పేర్కొన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

PREV
Read more Articles on
click me!