
అమరావతి: తనకు ప్రాణహాని ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. పవన్ కు ప్రాణహాని ఉందని చెబితే భద్రత కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకముండాలన్నారు. టీడీపీకి నేర చరిత్ర లేదని, నేరాలను ప్రోత్సహించే సంస్కృతి తమకు లేదన్నారు. నేర రాజకీయాలకు టీడీపీ నేతలు బలయ్యారే తప్ప ప్రతిగా దాడులు కూడా చేసిన పాపాన పోలేదన్నారు. నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని నేనే నియంత్రించానని చంద్రబాబు తెలిపారు.
మరోవైపు నా విశ్వసనీయతే నా బలం, నా క్యారెక్టర్ నాకున్న ఆస్తి చంద్రబాబు అన్నారు. ఒక అవినీతిపరుడు బురద జల్లాలి అనుకుంటే అది నాకు ఎలా అంటుకుంటుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్‌ను ఎన్డీయే ప్రభుత్వం కాపాడుతోందిని ఆరోపించారు.
2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తనను హత్య చేసేందుకు ఓ ముగ్గరు కుట్ర పన్నుతున్నారని పవన్ కళ్యాణ్ గురువారం ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను చంపితే ఏమవుతుంది మహా అయితే ఓ నెల రోజులు గొడవలు అవుతాయని ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారని ఆ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.
వాళ్లు ఏ పార్టీకి చెందిన వారో ఆ వ్యక్తుల పేర్లు తెలుసునని వారి ముఖాలు కూడా తనకు తెలుసునన్నారు. అయితే తాను భయపడనని వీటన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. జనసేన పార్టీకి తన ప్రాణమే పెట్టుబడిగా పెట్టానన్నారు.
అటు తనను హత్య చేసేందుకు ముగ్గురు కుట్రపన్నుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించడంతో వారి పేర్లు చెప్పాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ కోరారు. ఆ ముగ్గురెవరో చెప్పాలని, ఆధారాలు ఏమైనా ఉంటే పోలీసులకు తెలియజేయాలంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఆధారాలు ఉంటే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో భద్రత కూడా పెంచుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పవన్ పర్యటన జరిగినన్ని రోజులు వ్యక్తిగత భద్రతతో పాటు, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు అదనపు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.