
గుంటూరు: తమ రాజకీయాల కోసం విజయవాడ అత్యాచార బాధిత కుటుంబాన్ని మీడియా ముందుకు తీసుకు రావడం కరెక్ట్ కాదని... ఇది చట్టవిరుద్దమని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. అత్యాచార బాధితురాలికి, బాధిత కుటుంబానికి అండగా మేమున్నామంటూ భరోసా ఇచ్చేందుకు వెళితే మహిళా కమిషన్ చైర్ పర్సన్ అయిన తనను అడ్డుకుని దుర్భాషలాడారు... దీన్ని ఏ విధంగా సమర్ధిస్తారు..? అని టీడీపీ మహిళా నేతలను వాసిరెడ్డి పద్మ నిలదీశారు.
టీడీపీ మహిళా నేతలు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులతో రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ను కలిశారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వాసిరెడ్డి పద్మకు వినతిపత్రం అందించారు.
Video
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ… టిడిపి మహిళా నాయకురాళ్లు మహిళా కమీషన్ కార్యాయలం వద్ద ఆందోళన చేపట్టడం సరికాదన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తమ నోటీసులు పట్టించుకోకుండా విచారణకు హాజరుకాకపోవడమే కాదు టిడిపి మహిళలు ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ దగ్గర ఆందోళన చేయడం విచారకరమన్నారు వాసిరెడ్డి పద్మ.
''మాజీ సీఎం చంద్రబాబు మహిళా కమిషన్ ను గౌరవిస్తారని భావించాము. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పడానికి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చాము. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో టిడిపి నేతలు నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారు. అందుకే అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలనేది చెప్పాలనుకున్నాం. చంద్రబాబు, బోండా ఉమా చేసిన తప్పులు ఏంటో మీడియా ద్వారా చెప్తున్నాం'' అంటూ ఒక్కో తప్పును వివరించారు.
చంద్రబాబు నాయుడు, బోండా ఉమతో పాటు మరికొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలు చేసిన పది తప్పులివే:
మొదటి తప్పు - పదుల సంఖ్యలో బాధితురాలి దగ్గరికి వెళ్లడం
రెండో తప్పు - గుంపులుగా వచ్చి గట్టిగా అరవడం.
మూడో తప్పు - బాధితురాలిని భయకంపితం చేయడం.
నాలుగో తప్పు - సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మంది మార్బలంతో వచ్చారు.
ఐదో తప్పు - పరామర్శించడానికి వచ్చిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ అడ్డుకోవడం.
ఆరో తప్పు - సాటి మహిళగా పరామర్శకు వెళ్లిన తనను అడ్డుకోవడం
ఏడో తప్పు - తనను బెదిరించడం,విధులు అడ్డుకోవడం
ఎనిమిదో తప్పు - చంద్రబాబు వ్యక్తిగతంగా తనను బెదిరించడం
తొమ్మిదో తప్పు - బోండా ఉమా అనుచిత పదజాలంతో దూషించడం
పదో తప్పు - కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తిప్పడం
విజయవాడ అత్యాచార ఘటనలో టిడిపి అదినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.వీటన్నింటిపై న్యాయనిపుణులతో చర్చించి చట్టబద్దంగా ముందుకు వెళతామని తెలిపారు. ఈ తప్పులకు వివరణ కోరేందుకే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్లు మహిళా కమీషన్ చైర్ పర్సన్ తెలిపారు.