
నంద్యల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ గెలిచినందుకు ముందుగా ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావునే అభినందించాలని వైసీపి నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలకంటే అభ్యర్థి విజయానికి వెంకటేశ్వరరావే ఎక్కువగా కష్టపడ్డారని ఆరోపించారు. ఆయనతోపాటు సిబ్బంది కూడా ఎన్నికలకోసం బాగా పనిచేసిందని, వారిని కూడా సన్మానించాలని సూచించారు. వైసీపీ కార్యాలయంలో మాట్లాడిన అంబటి, చంద్రబాబు పై దుమ్మెత్తిపోశారు.
చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసింది అభినందన సభ కాదని, నంద్యాల, కాకినాడ ఎన్నికల జమ లెక్కల కోసమే సభను నిర్వహించారని రాంబాబు ఆరోపించారు. టీడీపీ నంద్యాల, కాకినాడలో మనీ, మీడియా, పోల్, పొలిటికల్ మేనేజ్‌మెంట్ వల్లే గెలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ.. ఉప ఎన్నికల ఫలితం మాదిరిగా ఉంటాయని భ్రమపడితే పొరపాటన్నారు. నంద్యాల్లో ఉప ఎన్నిక ఒక్కటే కావున విజయం సాధ్యమైంది. సాధారణ ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి.. చంద్రబాబు పోల్ మేనేజ్‌మెంట్ చేయ్యగలడా.. అని ప్రశ్నించారు. అప్పుడు ఇలా డబ్బుతో ప్రజలను మభ్య పెట్టడం కుదరదని ఆయన విమర్శించారు.
అదేవిధంగా గౌతం రెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పంధించారు. గౌతమ్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు పార్టీ దృష్టికి రాగానే తక్షణమే సస్పెండ్ చేశామని చెప్పారు. అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని తమ పార్టీ సహించబోదని ఈ సందర్భంగా అంబటి స్పష్టం చేశారు.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి