జగన్ ఇంటికి కూతవేటు దూరంలోనే యువతిపై అత్యాచారం... ఇదీ రాష్ట్రంలో శాంతిభద్రతలు: చంద్రబాబు సీరియస్

By Arun Kumar PFirst Published Jun 22, 2021, 4:14 PM IST
Highlights

జగన్ రెడ్డి ఫేక్ ముఖ్యమంత్రి అని.... నిత్యం అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

అమరావతి: జగన్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రభుత్వ తప్పులను ఎండగట్టేందుకు తగిన భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు నియోజకవర్గ ఇంఛార్జ్ లు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ లో ఘోరంగా విఫలమయ్యిందన్నారు. వారం రోజులు టీకాలు వేయకుండా ఒక్కరోజు వేసి మమ అనిపించారని... ప్రచారం మాత్రం గొప్పగా చేసుకుంటున్నారన్నారు. 

''జగన్ రెడ్డి ఫేక్ ముఖ్యమంత్రి. నిత్యం అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రకటనలకు మాత్రమే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. జగన్ రెడ్డి వైఫల్యాలపై పెద్దఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది'' అని అన్నారు. 

''పది, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరితే మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేశాయి. జగన్ రెడ్డిది ఉన్మాదమనాలా, మూర్ఖత్వం అనాలా? గ్రూప్-1 ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయి. ఇప్పుడు ఇచ్చిన జాబ్ కేలండర్ పై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉంది. జగన్ ప్రభుత్వం విడుదల చేసినది జాబ్ కేలండర్ కాదు జాబ్  లెస్ కేలండర్. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్రం పరిస్థితి దయనీయంగా మారింది'' అన్నారు. 

read more  నీ ప్లాన్ ఢిల్లీ పెద్దలకు తెలిసిందట.. నీ నట్లు బిగిస్తారు ఉండు: విజయసాయిరెడ్డిపై అయ్యన్న సెటైర్లు

''పారిశ్రామిక రంగాన్ని ప్రాధాన్యతారంగంగా గుర్తించక పోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగ యువత భవిత ప్రశ్నార్ధకమైంది. ఏటా లక్షలు ఖర్చు పెట్టి వివిధ కోర్సులు పూర్తి చేసి బయటికి వస్తున్న యువతకు ఉద్యోగ, ఉపాధి చూపే విధానాలు అమలు చేసే సమర్ధత ఈ ప్రభుత్వానికి లేదు. బాధ్యత, సమర్ధత లేని, అబద్దాల పరిపాలనలో యువత భవిత ప్రమాదంలో పడింది. రాష్త్రవ్యాప్తంగా తెలుగుదేశం యువత, విద్యార్థి విభాగాలు జగన్ రెడ్డి వైఫల్యాలను నిలదీస్తున్నాయి'' అని పేర్కొన్నారు. 

''ఎక్కడ చూసినా రేప్ లు, సెటిల్ మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు, గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలోని సీతానగరంలో యువతిపై దారుణంగా అత్యాచారం జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు'' అన్నారు. 

''ఇరిగేషన్, ప్రత్యక హోదా అటకెక్కింది. పన్నులు మాత్రం విపరీతంగా పెంచారు. ప్రజల్లో వీటన్నింటిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. తమిళనాడులో సమర్థులైన, నోబుల్ గ్రహీతలైన వారిని ఆర్థిక సలహాదారులగా పెట్టుకున్నారు. ఇక్కడ మాత్రం అసమర్థులను నియమించారు'' అని ఆరోపించారు. 

''ఐఐఎంకు చెందిన ప్రొఫెసర్ ఇవాళ కరోనా మరణాలపై విశ్లేషించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణాలు ప్రభుత్వ లెక్కలకంటే 14 రెట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. జగన్ రెడ్డి తప్పుడు విధానాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉంది. 29న తేదీన ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది'' అని ప్రకటించారు. 

''పల్లా శ్రీనివాస్, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ ఛైర్మన్ నియామకం విషయంలో హైకోర్టు తీర్పు జగన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిది. కర్నూలులో ఫ్యాక్షన్ హత్యలకు పాల్పడుతున్నారు. బీసీ జనార్థన్ రెడ్డిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన వారిని, టీడీపీలో యాక్టివ్ గా ఉన్నవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. భవిష్యత్ లో తగిన గుణపాఠం తప్పదు''అని చంద్రబాబు హెచ్చరించారు. 

 
 

click me!